‘దళితబంధు’పై అధ్యయనం.. దళితవాడలకు అధికారుల బృందాలు

by Shyam |
cm-kcr government
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్ నుంచి ప్రారంభానికి నోచుకోనున్న దళితబంధు పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో సోమవారం కూడా సమీక్ష నిర్వహించారు. అధికారుల బృందాలు త్వరలోనే క్షేత్రస్థాయి పర్యటన చేపట్టాలని, ఈ పథకం అమలు చేయడానికి ముందే దళితుల జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి, పథకం ద్వారా అందుకునే నగదుతో ఏ రకంగా ఆర్థికంగా స్థిరత్వం వస్తుంటి లాంటి అంశాలను ఈ పర్యటన సందర్భంగా విశ్లేషించాలని అధికారులకు సీఎం సూచించారు. పథకం ద్వారా ఇస్తున్న పది లక్షల రూపాయల ఆర్థిక సాయం మొక్కుబడిగా కాకుండా వారు ఇష్టపూర్వకంగా తీసుకుని జీవితంలో నిలదొక్కుకునేందుకు దోహదపడాలని స్పష్టం చేశారు. ఆ సాయంతో ఏం పనిని చేయాలనుకుంటున్నారో తెలుసుకోవడంతో పాటు ఏ మేరకు సాధ్యమవుతుందో అంచనా వేసి అవగాహన కలిగించాలని దిశానిర్దేశం చేశారు.

దళితులు వారి అభివృద్ధిని వారే నిర్వచించుకునే దిశగా చైతన్యవంతులై ఉత్పత్తిలో భాగస్వాములైనప్పుడు నిజమైన సాధికారత లభిస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకం సమర్ధవంతమైన అమలుపై అధికారులు దృష్టిపెట్టాలన్నారు. అనతి కాలంలోనే ఆర్థిక స్వావలంబన కలిగించే వినూత్న ఉపాధి స్కీంలకు రూపకల్పన చేసి లబ్ధిదారులకు అర్థం చేయించాలన్నారు. తొలుత అధికారులు సెన్సిటైజ్ అయితే ఆ తర్వాత లబ్ధిదారులకు ఉపయోగపడేలా అర్థం చేయించగలుగుతారని అన్నారు.

పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న హుజూరాబాద్ నియోజకవర్గ గ్రామాల్లో అధికారుల బృందాలు స్వయంగా పర్యటించి దళిత కుటుంబాల స్థితి గతులను తొలుత అర్థం చేసుకోవాలని సీఎం సూచించారు. దళిత కుటుంబ సభ్యులు అభిప్రాయాలను సేకరించాలని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వారికి అనువైన రీతిలో త్వరితగతిన ఆర్థిక స్థిరత్వాన్ని కలిగించే పనులను గుర్తించి వాటిని పథకాలుగా మలచాలని పేర్కొన్నారు. ఉపాధి కల్పించే వినూత్న పథకాల రూప కల్పన జరగాలంటే ముందు క్షేత్రస్థాయి పర్యటలను చేపట్టానలన్నారు.

దళిత వాడలకు వెళ్ళినప్పుడు ఎవరెవరిని కలవాలి, వారి నుంచి సమాచారం ఏ విధంగా తీసుకోవాలి తదితర అనేక అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. దళితుల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలన్నారు. వారి సూచనలను పరిగణనలోకి తీసుకుని స్కీమ్‌లను రూపొందించాలని సూచించారు. దళితుల అవసరాలు ఎలా ఉన్నాయి, అర్హులైన లబ్ధిదారులకు పథకం అందించగానే ఎక్కువ కాలం గ్యాప్ లేకుండా ఆదాయం సృష్టించుకునే విధంగా ఉంటుందా లేదా తదితరాలను దృష్టిలో పెట్టుకుని ఈ పథకం కింద అమలు విధానాలను గుర్తించాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed