వారు రాలేదని విద్యార్థుల కడుపు మాడుస్తున్న ఉపాధ్యాయులు

by Shyam |   ( Updated:2021-09-04 02:18:43.0  )
వారు రాలేదని విద్యార్థుల కడుపు మాడుస్తున్న ఉపాధ్యాయులు
X

దిశ, కొత్తగూడ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సరైన విద్యతో పాటు పోషకాహారం అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తోంది. కానీ, కొందరు అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది. విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రభుత్వం ధీమాగా చెప్తోంది. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి.

ఇదీ సంగతి…

కరోనా కారణంగా దాదాపు 17నెలల అనంతరం పాఠశాలలు తెరుచుకున్నాయి. కొత్తగూడ మండలంలోని అన్ని పాఠశాలల మాదిరిగానే బత్తులపల్లిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో కూడా తరగతుల్ని ప్రారంభించారు. మొదటి రోజు పిల్లలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా విద్యార్థులు తమ ఇండ్ల నుంచి గత రెండురోజులుగా పాఠశాలకు టిఫిన్ బాక్స్‌లు తీసుకెళ్తున్నారు. వంటలు వండాల్సిన ఆయా రాలేదని అందుకే ఇంటి నుంచి టిఫిన్ బాక్స్ తీసుకెళ్తున్నామని విద్యార్థులు వాపోతున్నారు. వాస్తవానికి ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలు ఆర్థికంగా వెనకబడి ఉంటారు. వారు వాళ్ళ పిల్లల్ని పాఠశాలకు పంపడానికి మధ్యాహ్న భోజన పథకం ఓ కారణం. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజన ఏర్పాట్లపై అధికారులు వ్యవహారించిన తీరు మండల వ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. పాఠశాలకు హాజరవుతోన్న విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతీ రోజు విద్యార్థులకు భోజనం అందించాలి.

అధ్వాన్న స్థితిలో పాఠశాల పరిసరాలు

బత్తులపల్లి జిల్లా పరిషత్ పాఠశాల సమస్యల వలయంగా మారింది. విద్యార్థులు ఉపయోగించాల్సిన మరుగుదొడ్లు అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. మల, మూత్ర విసర్జన కోసం పక్కన ఉన్న మొక్కజొన్న చేన్లలోకి విద్యార్థులు వెళ్తున్నారు. పాములు, తేళ్ల నుంచి వారికి ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో పెద్ద గుంతలతో విద్యార్థులకు అసౌకర్యం కలిగిస్తోంది.

నాగరత్న, ప్రధానోపాధ్యాయురాలు

మధ్యాహ్న భోజనం సిద్ధం చేయాల్సిన, వంట వాళ్ళు రావట్లేదు. అందుకే విద్యార్థులకు భోజనం అందించలేకపోతున్నాం.

శ్రీదేవి, ఎం.ఈ.ఓ

కొత్తగూడ మండలంలోని అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాల్సిందే. పాఠశాలకు సంబంధించిన హెడ్ మాస్టర్ బాధ్యత తీసుకొని విద్యార్థులకు భోజనం అందించేలా చూడాలి. బత్తులపల్లి పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెట్టలేదన్న విషయంపై సమాచారం లేదు. తెలుసుకొని ఏర్పాట్లు చేపిస్తాం.

Advertisement

Next Story

Most Viewed