కొడుకా లే నాయనా… ఏం కాదు బిడ్డా !

by  |
కొడుకా లే నాయనా… ఏం కాదు బిడ్డా !
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నగరంలో ప్రతిఒక్కరిని కంటతడి పెట్టించే సంఘటన జరిగింది. ఆస్పత్రిలో కొడుకు దగ్గరకు వెళ్లి ఓ తండ్రి పడిన బాధ అక్కడున్నవారి హృదయాలను కదిలించింది. గుండెను బరువు చేసి బాధను పిండేసింది. కొడుకా.. లే నాయనా ఏం కాదు బిడ్డా.. సప్పుడు చేయవేందిరా.. అంటూ ఆ తండ్రి పడిన వేదన చలించిపోయేలా చేసింది. కొడుకు ఒళ్లు మొత్తం నొక్కుతూ కండ్లలోకి కండ్లు పెట్టి చూస్తుంటే అక్కడున్నవారు కళ్లలో నీటిని ఆపుకోలేక పోయారు. దగ్గరకు వెళ్లి చెబుదామంటే కొవిడ్‌ నిబంధనలు.. దూరం నుంచి చెప్పేంత పరిస్థితి లేదు. ఆస్పత్రికి వచ్చేసరికి కొడుకు బెడ్‌పై ఉండటాన్ని చూసి.. తట్టుకోలేక పోయిన ఆ తండ్రి.. చనిపోయాడని తెలియక ఒళ్లు నొక్కుతుండటంతో అక్కడున్నవారు కంటతడి పెట్టారు. హృదయవిదారక సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

తిరుపతి సప్తగిరినగర్‌కు చెందిన శేఖర్‌ అనే యువకుడికి మూడ్రోజులుగా ఒళ్లునొప్పులు, తీవ్రమైన జ్వరం వస్తోంది. అయితే అప్పటినుంచి తిరుగుతున్నా ఎక్కడ కరోనా పరీక్షలు చేస్తున్నారో తెలీదు. ప్రభుత్వాస్పత్రికి వెళ్లినా ఎవరూ పట్టించుకోకపోవడంతో మళ్లీ ఇంటికే వస్తున్నాడు. ఇదేక్రమంలో ఇతరులు ఇచ్చిన సమాచారంతో కొవిడ్ టెస్టులు చేసే సంజీవని బస్సు వద్దకు చేరుకొని గురువారం అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన స్థానికులు 108కు ఫోన్ చేయగా తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు షిప్ట్ చేశారు.

అయితే 32ఏళ్ల యువకుడు శేఖర్‌ ఎమర్జెన్సీ వార్డుకు తరలిస్తున్న క్రమంలోనే ప్రాణాలు విడిచాడు. ఇంతలో విషయం తెలుసుకున్న శేఖర్ తండ్రి ఆస్పత్రి వద్దకు వచ్చి… బెడ్‌పై ఉన్న కుమారుడిని చూసి కన్నీరు పెట్టాడు. తన కొడుకు ఒళ్లునొప్పులకు తట్టుకోలేకనే కళ్లు తిరిగి పడిపోయాడనుకొని… ఒళ్లు మొత్తం నొక్కాడు. కొడుకు చనిపోయాడన్న విషయం తెలియక చాలాసేపు ఇలానే చేశాడు. ఇంతలో డాక్టర్లు, నర్సులు కొడుకు చనిపోయాడని కన్ఫామ్ చేయడంతో బోరున విలపించాడు. మూడ్రోజులుగా ఆస్పత్రికి వెళ్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, నిర్లక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. టెస్టులు చేస్తున్న విషయాన్ని తెలుసుకొని ఇవాళ సంజీవని బస్సు దగ్గరకు వెళ్లి.. కానరాని లోకాలకు వెళ్లిపోయాడని ఏడ్చాడు. ఈ సంఘటన ఆస్పత్రిలో ఉన్న ప్రతిఒక్కరిని కంటనీరు పెట్టించింది.


Next Story