ఆ బాలుడి సంకల్పం.. లక్ష్యాన్ని కరిగించింది!

దిశ, వెబ్‌డెస్క్: లండన్‌కు చెందిన ఓ మాజీ సైనికుడు టామ్ మూర్.. తన 100వ పుట్టినరోజు సందర్భంగా తనకు తానే సవాల్ విసురుకుని మొత్తంగా 100సార్లు తన ఇంటి చుట్టూ తిరిగి ఔరా అనిపించిన విషయం తెలిసిందే. అసలే ఓ ఎముక విరిగింది.. ఆపై 100 సంవత్సరాల వయసు, ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా అలా చేస్తారా? కానీ మూర్ మాత్రం కరోనా బాధితుల కోసం 1000 పౌండ్ల విరాళాలు సేకరించాలనే లక్ష్యంతో ఏప్రిల్ 8న ‘జస్ట్ గివింగ్ ఫండ్ రైజర్’ పేరుతో ఆ చాలెంజ్ చేపట్టాడు. కేవలం వారం రోజుల్లోనే ఏకంగా 19 మిలియన్ పౌండ్ల విరాళాలు సేకరించి యూకేకు చెందిన ‘నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్)’కు అందించాడు. ఇప్పుడు ఈ ‘సెంచరీ తాత’ ప్రస్తావన ఎందుకంటే.. ఈ కురువృద్ధుడిని ఆదర్శంగా తీసుకున్న ఓ ఐదేళ్ల చిన్నోడు కూడా అదే తరహాలో విరాళాలు సేకరించి.. అందరితో శభాష్ అనిపించుకున్నాడు.

సౌత్ఈస్ట్ ఇంగ్లాండ్‌లోని వెస్ట్ మలింగ్‌కు చెందిన ఐదేళ్ల బాలుడు టోని హడ్గెల్. ఈ చిన్నోడికి పుట్టినప్పటి నుంచే రెండు కాళ్లు లేవు. దాంతో అతడి పేరెంట్స్ చిన్నప్పటి నుంచే తనను ‘లండన్ చిల్డ్రన్స్ హాస్పిటల్’(ఎల్‌సీహెచ్)లోనే ఉంచారు. కాగా వైద్యులు ఆ బాలుడికి ప్రోస్థటిక్ లెగ్స్ అమర్చగా, ఇటీవలే క్రచెస్ మీద నడవడం నేర్చుకున్నాడు. ఈ క్రమంలో తనను కాపాడిన, తనకు జీవితాన్నిచ్చిన హాస్పిటల్ కోసం ఏదైనా చేయాలనుకున్నాడు టోనీ. ఈ తరుణంలోనే మూర్ నడవడం ద్వారా విరాళాలు సేకరించడం చూసి స్ఫూర్తి పొందాడు. తాను కూడా రెండు ప్రోస్థటిక్ కాళ్లతో 6 మైళ్లు నడిచాడు. టోనీ చేసిన పనికి విరాళాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. తన నడవడం ద్వారా నెల రోజుల్లోనే.. 1 మిలియన్ పౌండ్లు ($ 1.2 మిలియన్లు) కంటే ఎక్కువ సేకరించాడు. ముందుగా 500 పౌండ్లు సేకరించాలని భావించాడు. కానీ, ఆ లక్ష్యాన్ని కొద్ది రోజుల్లోనే చేరుకోవడంతో మరింత సేకరించాలని డిసైడ్ అయ్యాడు. ఆ విధంగా సేకరించిన డబ్బులను హాస్పిటల్‌కు ఇచ్చేశాడు.

తనను దత్తత తీసుకున్న కుటుంబంతో కలిసి ఈ సంతోష సమయాన్ని పంచుకున్నాడు. ‘టోనీ విరాళాలు సేకరిస్తానని, ఇంత దూరం నడుస్తానని చెబితే.. మేము అది సాధ్యం కాదనుకున్నాం. కానీ, తను సంకల్పంతో.. అనుకున్న లక్ష్యాన్ని చేధించడం చూసి చాలా గర్వపడుతున్నాం’ అని అతని తల్లి పౌలా హడ్గెల్ తెలిపింది.

Advertisement