Tangalan Review : ఊరికొక్క తంగలాన్

by Bhoopathi Nagaiah |
Tangalan Review : ఊరికొక్క తంగలాన్
X

తంగలాన్ సినిమా సమీక్ష 1వ భాగం

ఈ సినిమా చూసి బాగా నొప్పి తెచ్చుకున్న వాళ్ళు ఒక్కటంటే ఒక్క పని చేయండి చాలు. మీరు మా ఊరికి రండి. అక్కడున్న ఆంజనేయ స్వామి గుడికి మా ఊరి చివర ఉన్న మావాళ్ళను ఇప్పటికీ ఆ గుడిలోకి రానివ్వరు. టా... ట్.. ఎక్కడుంది ఇంకా అలా.. అసలు మా మతం మట్టి కుప్పలు అనేవాళ్ళు రండి ఒకసారి. మా ఒక్క ఊరే కాదు... అన్ని ఊర్లల్ల ఇదే ఉంది. ఇగ మా ఊరికి ఔతలున్న పోషమ్మ గుడికి ఇవేం లేవు. ఎవ్వలన్న పోవచ్చు... రావచ్చు. వరలక్ష్మీ వ్రతం అంటె నాకు మంట. ఎందుకంటే ఆమె ఓన్లీ ఆర్యుల క్రియేటెడ్ దేవత. ఆమె లేకన్నా ముందే... సింధు నాగరికత కంటె ముందే అమ్మతల్లిని.. అంటె ప్రకృతిని పూజించినం ఇక్కడ. నిండా నగలు దిగేసి, పట్టు చీరలు చుట్టి.. పది రకాల ప్రసాదాలు కావి మావు. రావి చెట్టుకింద రాయికి బొట్లు వెట్టి... పప్పు బెల్లం ప్రసాదం పెడితే చాలు. పట్టు బట్టలు అవుసరం లేదు. ఉతికిన బట్టలు కట్టుకుంటే చాలు. పొద్దున లేచి ఇల్లు ఆకలి కొట్టుకొని ఇంత ఉన్నది ఉడుకేసుకొని పొయి పొలంల శెన్ల పడి పని చేసుకునే మాకు... ఏసీ రూముల్లో పట్టు పరుపుల మీద హాయిగా పవలించి... సింగారించుకుని వచ్చే సరికి అన్ని సిద్ధంగా ఉంచితే పూజలు, వంటలు చేసి... మనసొంటి అంటె మనలాగా రిచు లేదా మన కులం లోని మనలాగా నగల షాపు బట్టల షాపు దిగేసుకొని వచ్చే నలుగురి ముందు డబ్బా కొట్టుకొని... పది ఫోటోలు... దిగి.. మల్ల బాగా రెస్ట్ తీసుకునే మీకు అసలు మాట్లాడే హక్కే దిక్కు లేదు. సర్లే పోవమ్మ వ్రతమా కాసేపు నువు పక్కకు.

మాకు మా పొలాలు కౌలుకు తీసుకున్న పొలాలు ఇర్గ ఉండేటియి. దాన్ల పది వేల జీతానికి (నెలకు కాదు...) ఏడాదికి పని చేసే జీతగాళ్ళు ఏడాది మొత్తం పొలంలోనే ఉండి పంట కుప్పవోసినంక ఎక్కడో గుండెల్లో కలుక్కుమని బాధ సుడి తిరుగుద్ది... ఇది నాది కాదు... నాది ఇక్కడ కట్టం మాత్రమే అని. బయటికి అనక పోవచ్చు... ఆ నొప్పిని ఇపుడు నాకున్న ఆలోచన పరిధికి అనుభూతి చెందుతున్న అనే కంటె అప్పటి వాళ్ల ఆ పెయిన్ ఇప్పుడు నన్ను మెలి తిప్పుతుంది. ఏండ్లకు ఏండ్లు పని చేసిన మా బాది తంగలాన్ లెక్కనే కట్టపోతు. ఒకసారి తర్వాత చూసినపుడు బక్కగ బొక్కలు తేలి ఈడ్సుక పోయి కనబడితే ఆ క్షణం ఆగిపెయిన నేను. లచ్చవ్వను అడిగిన గట్లైండు ఎందే అని... ఎండ్లకేండ్లు మొద్దు లెక్క కట్టమే చేసుకుంటవోతే ఇంకెట్లయితరు అన్నది. అంతక ముందు రాజిగాడు, నర్శిగాడు, పోషం వీళ్లంతా తంగలాన్ లే.

ఒక మూడు వేలు కావాలి పటేల... మిత్తికి అనస్తరు. ధర్మాత్ముని లెక్క ఇస్తడు మిత్తికే. ఈయనకి తెల్సు వాళ్ళు కట్టరు అని. రోజు కూలీకి పోతేనే ఎప్పటికి అప్పుడు అవుసరాలు ఒడ్డెక్కే దగ్గర ఒక్కసారి గన్ని కొత్తలు ఎట్ల కుప్పైతయి ఇగ. ఆరునెలలు చూసి పైసలియ్యి అన్ని ఒత్తుటం జేత్తడు పటేల్. ఏం జెయ్యాల్నో తెల్వదు. సరే పొలం రెండేండ్లు కౌలుకు రాసుకో అంటడు ఇగ. చూడు ఇపుడు ఆళ్ల పొలంలో ఆల్లె మల్ల కైకిల్ పోతరు. మల్ల ఈ పటేలుకు వాళ్ళను ఉద్ధరిచ్చినట్టు నెత్తి పొగరు. అణిగి మణిగి ఆళ్ళు. నా నెత్తిల ఎంటుకలన్ని చెప్పుకుంట పోతే. అప్పటి నుండి ఇంక ఉరుకుతనే ఉంది దోపిడీ.. నడుసుడు అంటె ఏదొక రూపంలో మెల్లగ అని.. ఇపుడు అన్ని రూపాల్లో దోసుడే.

భూమి మీద హక్కు మాది... వందల ఏండ్ల నుండి ఆళ్లు జెంగళ్లనే ఉంటర్రు... అడివిల జీవరాసులు జిట్టగుర్రులతోని చెట్లు.. పురుగూ బుషి తొని కలిసే... ఎప్పుడూ రాని ఆపద వాళ్ల వల్ల ఇపుడు పులులకు వచ్చిందని అందర్నీ తీస్కపొయి నీళ్లు నిప్పులు లేని జాగల పడేసిర్రు. అసలు ఇన్ని వందల ఏండ్ల నుండి ఏ అడవి బిడ్డలను ఏ పులో గుడ్డెనుగో... కొట్టినట్టు ఎక్కడ ఇన్లేదు. వాళ్ళు అవీ వాళ్ల భాషలో వాళ్ళు మాట్లాడుకుంటరు. హహ... దొరికినయి దొరికినట్టు వేటాడిన ఏ రాజవంశీయుల తరం మీదనో జమీందార్ల నెక్స్ట్ జనరేషన్ మీదనో కేసులు నూకలేదు ఏం... మరి. వీళ్ల ముత్తాతల తాతలు కట్టిన ఇండ్లు, దున్నిన సాళ్ళు, తిరిగిన అడుగులు మీవి కావని ఎట్ల అంటవ్ నువు అసలు. అవును భూమి మీద హక్కు వాళ్ళదే.... అడవి మీద హక్కు వాళ్ళదే. రాత్రి పగలు బంగారం పండించిన వానిదే. తంగలాన్ అన్నట్టు ఈ నేల జాలి పడి ఇచ్చిందే తీసుకోవాలి కాని తవ్వి తీయడం తప్పు అని. అవును ఇక్కడ కూడ అడవి ఇచ్చిందే... ఇప్పపువ్వు, అడివి పండ్లు, అడివి గడ్డి... మైదానపు రాజులు వచ్చి బంగారం కావాలన్నట్టు... మైదానపు భూసాములు, వ్యాపారాల లాగా అడవి చెట్లు... అడవి కొండల కింద ఖనిజాలు వీళ్లకు తప్పే. యా... యా... మీకు నొప్పి రావడం సహజం. మీకు నొప్పి విలువ తెలువడానికే తంగలాన్.

బుద్ధుడు.... నిజం కాదా అది. నిజమే కాబట్టి మీ నొప్పి వందరెట్లు ఎక్కువ అయింది. అడ్డ నామాల, నిలువు నామాల అయ్యవార్లు చేసింది అదే కదా. బుద్ధునికి నగలు తొడిగి నామాలు పెట్టి మీ వాడిగా లెక్కేసుకున్నరు. కని అక్కడ ఉన్నది బుద్దులు జైనులు అని ఆర్కియాలజీ ప్రూవ్ చేసింది అంటె మీ జంజిరాలు ఏమవునో పాపం. ప్రసిద్ధ విందు గుళ్ళు అన్ని అవే.. తెలుసా. తిరుపతి, శ్రీశైలం, యాదగిరి, వేములవాడ, ఉండవల్లి, అన్నవరం, అప్పన్న, అహోబిలం... ఎన్నెన్నో. మజీద్ మీదికి ఉరుకుతం గాని వీటి జోలికి పొతే మన జంజీరమే తెగేది అని వణుకు.

తంగలాన్ - గంగమ్మ

డబ్బులు ఇచ్చేసి పొలం పత్రాలు తీసుకున్నాక తంగలాన్ కుటుంబం ఆ పొలంలో తిరుగుతరు. తంగలాన్ అపుడు ఆ పొలంలో వెల్లకిలా పడుకొని తన్మయం పొందుతడు ఇది నా భూమి అని. చిన్నప్పుడు మా పొలం దున్నుతుంటే ఆ మట్టిబెడ్డల మీద నాక్కూడా అట్లనే పండుకోవాలని అనిపిస్తుండే. తంగలాన్ కు ఆరతి మాటిమాటికీ పక్కనుండి కనిపిస్తూ ఉన్నట్టు నాకు అడవిని చూస్తే అట్ల అనిపిస్తది. ఎదో మీదికి వచ్చి తూలినట్టు ఉంటది. ఎందుకు ఉండదు నా డీఎన్ఏలోనే ఉంది నా ముత్తాతల తాతల అస్తిత్వం. 7th సెన్స్ లో బోధిధర్మ డీఎన్ఏ అలా వాళ్ల తర్వాత తర్వాత తర్వాత తరంలో నిద్రాణమై ఉన్నట్టు ఇక్కడ ప్రతి ఒకరి లోపల మీ మీ మూల వాసుల డీఎన్ఏ మీలో ఖచ్చితంగా ఉంటుంది అనిపిస్తది అలా నిద్రాణంగా. అప్పుడప్పుడు మీ మీదికి వచ్చినా చాలా మంది దాన్ని గుర్తించలేరు. నాకు అప్పుడప్పుడూ ఒకటి బాగా మెదులుతూ ఉంటుంది కలలో కాదు మెలకువ లోనే... ఓ ఐదారు వందల ఏళ్ల కిందటి రాళ్ళు తేలిన రోడ్డు..., ఆ రోడ్డుమీద దుమ్ము... రాళ్ళతో కట్టిన ఇండ్లు, ఎడ్ల బండ్లు... నీళ్ల అంపులు.. నేత బట్టలు కట్టిన ఆడొల్లు... ఇంతే. ఇంక నా మెదడు చించుకున్నా ఇంతకు మించి ముందుకు కాని వెనక్కి కాని ఎదీ రాదు. కాంతార చూసి అడవి పందిని పంజులి అని చెప్పుకున్నారు కదా. మా ఊర్లో జెంగలి పక్కకు అడవి రాజుల గుడి ఉంటది. ఎవరా అడవి రాజు అనా... మా దిక్కు అడవి రాజులు అని అడవి పందులను అంటరు. ప్రతి ఊర్లో వందలాది తంగాలాన్లు మనకు.

ఈ భూమి మీద హక్కు మాది... ఎన్నెన్నిసార్లు నా చెవుల్లో మోగుతుంది అది. అసలు ఉత్తరాన సింధు నాగరికత ఉన్నప్పుడు దక్షిణాన ద్రావిడ నాగరికత ఉండేది. మీరు అనే హిందూ ఆర్యుల నుండి వచ్చింది. అవన్నీ సింధు నాగరికత తర్వాత వచ్చినపుడు... ఈ హిందువులు ఎట్ల పెత్తనం చేస్తరు అసలు బుద్ధి అనేది లేకుండా. మనది కానిది మాది అని ఎట్ల మీరు గుండెలు బాదుకుంటున్నరు. సినిమాలో దుబాసీ ఇపుడు బయట చాలామందిలో కనిపిస్తున్నాడు. క్లెమెంట్ అనేవాడు రాజ్యం లాంటివాడు. అది ఇస్తా ఇది ఇస్తా అని బుదురకిచ్చి.. జుట్టు దొర్కవట్టుకొని.. బైటికి నూకుతరు. ఒక్క జాకిట్ ముక్క దొరికితే ఊరు పండుగ జేస్కునుడు.. ఏడుపు తన్నుకులాడింది. తంగలాన్ గంగమ్మ నా తాత-అవ్వ గావచ్చు. మనకు ఇంటికో తంగలాన్ ఉన్నట్టనిపిత్తంది.

........................

తంగలాన్ సమీక్ష 2వ భాగం

శాక్తేయమా.. వీరగల్లులా..

ఊర్లల్ల ఏ పని మొదలు వెట్టాలన్న ముందు పోషమ్మకు మొక్కుతరు. పోశమ్మ అనే కాదు.. ఎల్లమ్మకో.. మైసమ్మకో ముందు మొక్కుతరు. ఆది పూజలు అందుకునేది ఎంకయ్య తాత కాదు అసలుకు. ఐనకంటె ముందె పోశమ్మకు ఓ పాలకాయ గొట్టి.. పప్పు పలారం పంచి పెట్టుకుంటరు. ఇప్పుడు జెర ఏ గుడికన్నా అమ్దాన్ ఎక్కువత్తంది అంటె దాన్ని ఎండోమెంట్ల కలుపుడు... అండ్ల అయ్యగార్లు సొచ్చుడు... ఓ పసుపు కుంకుమ వెట్టుడా.. ఓ.. శీరె కనుము కప్పనిచ్చుడా.. గాజులు ఎయ్యనిచ్చుడా... ఇగ ఓడి బియ్యం పోయనిచ్చేదా. పదడుగుల దూరం కెళ్ళే మొక్కుడన్న మొక్కక ముందె ఆళ్లను బైటికి తరుముడు. అయితె వీరగల్లులు ఎందుకచ్చింది నడిమిట్లకు.. అనా..? అయితె కొన్ని జాగల్ల వీరగల్లులనె పోషమ్మా.. మైసమ్మ అని మొక్కుతరు అనిపిచ్చింది. అంతెందుకు మా పక్కూల్లె వీరగల్లుకు ఆంజనేయ కలర్ వూసి.. అంజన్న గుడిని జేశిర్రు. అదంతటువోణి... ఏందీ శాక్తేయం అనా.. ఒకనాడు మా నడిపన్నోళ్ళు అంటె మా నడిపి కాకోల్లు మల్లన్న పట్నాలేస్తుంటే.. నేను తీసి పారేసిన, యే గవన్ని నేను నమ్మ అని. అపుడు సదా అన్నడు.. అసలుకు అవే మనం మొక్కాల్సినవి. మల్లన్న, బీరన్నలు బహుజన దేవుళ్ళు. వీళ్లకు యే బాపన్ మంత్రాలు అవుసరం లేదు.. మమ్మల్ని సల్లగ జూడు బగమంతా అని శేతులెత్తి మొక్కుడు గంతే. ఇంక మనది శాక్తేయం.. అమ్మలను మొక్కుతం మనం అన్నడు.

అసలు అన్ని గుళ్ళల్ల బహుజన పూజారులు అంటె మల్లన్న బీరన్న గుళ్లల్ల ఒగ్గులు, కుర్మలే మొక్కుతరు. ఆ మొక్కెటియి గుడ మన కట్టమ్ సుఖం ఉండే పదాలుంటయి. ఇగ పోశమ్మ, ఎల్లమ్మ గుళ్ళళ్ళ అది గుడ లేదు. మనమే ఇంత.. దండం తల్లీ అని పదేళ్ల పబ్బతి వట్టి మొక్కుతమ్ మనాదిల. పండుగులు పబ్బాలే గాదుల్ల... లగ్గమైనా.. ఎదన్న దూరం పైనం బెయిన.. ఇంకెక్కడ దేవుళ్ళకు యాత్రలకు వెయిన.. పంటేసే ముందు.. అది కోసే ముందు.., అచ్చిన పంటల తొలి పాలు కొల్సి పక్కకు వెడ్తరు. అంతెందుకు బర్లు గొడ్లు ఈనిన గుడ ఆ మొదాటి ముర్రుపాలు పోషమ్మకే వెట్టి మొక్కుతరు. ఇగ కడుపుతోని ఉన్నోళ్లను లేకుంటే బాలింతను ఊరు దాటి తీస్కపొంగ ఊరెళ్ళంగ మనసుల తల్తరు.. తల్లీ రాంగ పొంగ సల్లగ జూడు నువ్వే అని. మల్లన్న బోనాలు వోసేటపుడు, లేకుండే పట్నాలేసేటపుడు బండారేసేటపుడు ఎంతమంది బహుజన దేవుళ్ళను, అమ్మతల్లుల పేర్లు తల్తరో లెక్కే లేదు. దాన్ల ఊరు గాసే ఊరవోసుకుగే.. (మల్లన్న బోనాలు వొస్కునేటోల్లకు యాదికచ్చి ఉంటది) అంటరు. అంటె ఆ తల్లులు ఊరును కాపాడుతరు. వీరగల్లులు ఊరిని కాపాడుతరు, ఇంక యుద్దంల సచ్చిపెయినొల్లను గుడ వీరగల్లులే అంటరు అనుకుంటన్న.

తంగలాన్ సిన్మాల వాడకట్టు జనం బంగారం కోసం ఊరుడిసి పోంగ... తంగలాన్-గంగమ్మ వీరగళ్లుకు మొక్కి పోతరు. మేమెక్కడికి వెయిన.. సల్లగ జూడు అని. మాకెయ్యి మేము పోషమ్మకు మొక్కినట్టు. పొలం గోసేటప్పుడు గుడ పసుపు ముద్దకు మొక్కుతరు. గంగమ్మకు పూన్కం అత్తది. ఇప్పటికి పంట వండినంక, పొలం గొసేటప్పుడు పసుపు కుంకుమేసి.. రెండు ఊదిబత్తీలు ముట్టిచ్చి.. ఓ కోడిపిల్లను గోసి, అప్పుడు ఆ పొలం గోసుడు మొదలు వెడ్తరు. అప్పటిదాక పొలం గొయ్యచ్చినోళ్ళు ఆడ ఒడ్డు మీద నిలవడి సూత్తరు. ఆ పొలంగల్లొల్లు ఐదు విడికిళ్ళు ముందుగాల గోసినంక, అంటెంక అందరు సాల్లు వట్టి కోత్తరు. ఇంక అడివి రాజులో.. గొండ దేవుళ్ళ గుడి ఉన్న పొలం అయితె శిన్న కోడి పిల్లను ఇడుస్తరు ఆ కోసే పొలంల. ఇడిసినంక అది ఊకుంటద.. ఆ పొలం ఉరుకుతది. మల్ల దొర్కవట్టి మల్ల కోళ్ల మందల ఇడుస్తరు తియ్యుర్రి గా పిడికెడు గుడ లేని పిల్లను ఎందుకు గోత్తరు గని. ఐతే ఒక్కేడు అట్ల మా నాయినె కౌలుకు జెపిచ్చిన గొండ పొలంల కోడి పిల్లను ఇడుస్తే అది మల్ల దొర్కలె ఎంత లెంకులాడిన. ఇగ సిన్మాల గంగమ్మకు పూన్కమత్తదిగా.. దాన్ని తూలుడు అంటరు. అదే పోశమ్మనో, మల్లన్ననో, రాయేసుడో, సమ్మక్క సారక్కనో.. మీదికచ్చి తూల్తరు. ఆ తూలే మనిషిని అన్ని అడుగుతరు.. బోనాల పండుక్కు భవిష్యం జెప్పినట్టు నపరి రెండు ముచ్చట్లు జెప్తరు. అందుకే అంటున్న ఊర్లల్ల లెక్క లేనంత మంది తంగలాన్లు అని.

- రాజీ (రజిత)

Advertisement

Next Story

Most Viewed