ప్రధాని పదవి ఇచ్చినా బీజేపీలో చేరను: సిద్ధరామయ్య

by Swamyn |
ప్రధాని పదవి ఇచ్చినా బీజేపీలో చేరను: సిద్ధరామయ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: తనకు రాష్ట్రపతి లేదా ప్రధాని పదవి ఇస్తామని హామీ ఇచ్చినా బీజేపీలో చేరబోనని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. మైసూర్ జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో లోక్‌సభ అభ్యర్థి ఎం.లక్ష్మణ్‌కు ఓట్లు వేయాలని కోరుతూ గురువారం నిర్వహించిన ఎస్సీ-ఎస్టీ కార్యకర్తలు, నాయకుల సమావేశంలో సిద్ధరామయ్య మాట్లాడారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ వలలో ప్రజలు చిక్కుకోకూడదని, శూద్రులు, దళితులు, మహిళలను ఆర్‌ఎస్‌ఎస్ గర్భగుడిలోకి అనుమతించదని ఆరోపించారు. సామాజిక న్యాయానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు వ్యతిరేకమని, అందుకే వారికి రిజర్వేషన్లంటే గిట్టవని అన్నారు. రిజర్వేషన్లు భిక్ష కాదని, అవి అణచివేతకు గురైన వర్గాల హక్కు అని తెలిపారు. సమాజంలో కులవ్యవస్థ ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉంటాయని చెప్పారు. ‘‘స్వాతంత్ర్యం రాకముందు, బ్రిటీష్ పాలనకు ముందు శూద్రులమైన మనకు చదువుకునే హక్కు ఉందా? మహిళలకు ఏమైనా హక్కులు ఉన్నాయా? భర్త మృతిచెందిన వెంటనే భార్య కూడా నిప్పంటించుకుని చనిపోయే అనాగరిక ఆచారం ఉండేది. మనుస్మృతి స్ఫూర్తితో ఆచరించిన ఇలాంటి అమానవీయ పద్ధతులను మన రాజ్యాంగం నిషేధించింది. అయితే, మనుస్మృతిని మళ్లీ తీసుకొచ్చేందుకు బీజేపీ రాజ్యాంగ సవరణలు చేస్తోంది. దీన్ని ప్రజలంతా అర్థం చేసుకోవాలి’’ అని సిద్ధరామయ్య కోరారు. కాగా, 28 లోక్‌సభ స్థానాలున్న కర్ణాటకలో ఈ నెల 26, వచ్చే నెల 7న రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్న విషయం తెలిసిందే.


Advertisement

Next Story

Most Viewed