రసవత్తరంగా హైదరాబాద్‌ MP ఎన్నికలు.. మజ్లిస్‌కు చెక్ పెట్టేలా BJP పకడ్బందీ వ్యూహం

by Disha Web Desk 2 |
రసవత్తరంగా హైదరాబాద్‌ MP ఎన్నికలు.. మజ్లిస్‌కు చెక్ పెట్టేలా BJP పకడ్బందీ వ్యూహం
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: పాతబస్తీలో తిరుగులేని శక్తిగా ఎదిగిన ఎంఐఎం పార్టీకి చెక్ పెట్టేందుకు బీజేపీ, బీఆర్ఎస్‌లు ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు గెలుస్తాం అనేలా రెండు పార్టీలు ప్రచార హోరును కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పూర్తిగా పాతబస్తీ ఓటర్లతో కూడుకుంది. నియోజకవర్గంలో 22,17,094 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మైనార్టీలు యాబై శాతానికి పైగా ఉన్నప్పటికీ ఈ పర్యాయం ఎంఐఎంకు గెలుపు అంత సులువు కాదనే సరికొత్త టాక్ ఇక్కడ నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల వరకు ఓల్డ్ సిటీలో ఎంఐఎం విజయంపై ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. అయితే ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత పాతబస్తీలో ఎంఐఎంకు చెక్ పెట్టడం కష్టమేమీకాదనే అభిప్రాయానికి బీజేపీ, బీఆర్ఎస్‌లు వచ్చినట్లుగా కనబడుతోంది.

ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి మాధవీలత ఎన్నికల ప్రచారంలో భాగంగా పాతబస్తీలో అసదుద్దీన్‌ను టార్గెట్ చేస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇందుకు తగ్గట్లుగానే ఆమెను గెలుపుతీరాలకు చేర్చాలని జాతీయ నాయకత్వం కూడా తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి, పార్టీ జాతీయ నాయకులు అమిత్ షా వంటి వారు కూడా రోడ్ షోలు నిర్వహించారు. ఇదిలా ఉండగా మాధవీలత ఒక అడుగు ముందుకు వేసి కుల, మతాలకు అతీతంగా ఓట్లు వేసి గెలిపించండి, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని ప్రజలకు మాటిస్తున్నారు. దీంతో మైనార్టీలు కూడా ఈ పర్యాయం బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఎంఐఎం గెలుపుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

అసెంబ్లీ ఎన్నికలతోనే మొదలైందా..?

గత అసెంబ్లీ ఎన్నికల నుంచే పాతబస్తీలో ఎంఐఎం ప్రాభవం తగ్గిందా? అంటే అవుననే సమాధానాలు వినబడుతున్నాయి. శాసనసభ ఎన్నికలలో యాకుత్‌పురా (హైదరాబాద్ పార్లమెంట్), నాంపల్లి (సికింద్రాబాద్ పార్లమెంట్) నియోజకవర్గాలలో ఎంఐఎం చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లుగా విజయం సాధించింది. గెలుపుకోసం కోసం చివరి వరకు ఎదురు చూడవలసి వచ్చింది. గతంలో జరిగిన ఎన్నికలలో పాతబస్తీ అంటే ఎంఐఎందే గెలుపు అనే అభిప్రాయం అందరిలో ఉండేది. అయితే ఇటీవల వస్తున్న ఫలితాలను బట్టి చూస్తే ప్రజల ఆలోచనలో మార్పులు వస్తున్నట్లుగా కనబడుతోంది. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం డీలిమిటేషన్ 2008లో జరిగింది. 1996లో జరిగిన ఎంపీ ఎన్నికలలో ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పోటీ చేసి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ చేతిలో 73,273 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2004, 2009, 2014, 2019లలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో అసదుద్ధీన్ ఒవైసీ వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు. అంతకు ముందు అతని తండ్రి సుల్తాన్ సలావుద్ధీన్ ఒవైసీ 1984, 1989, 1991, 1996, 1998, 1999 వరసగా ఆరు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంఐఎంకు ఎంతో ఘనమైన చరిత్ర ఉన్నప్పటికీ ప్రత్యర్థులు కూడా ప్రభావం చూపుతుండడంతో ఈ పర్యాయం నిలబెట్టుకుంటుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే గుడ్డిలోమెల్లగా ఎంబీటీ పోటీ నుంచి విరమించుకోవడంతో మైనార్టీల ఓట్లు చీలిపోకుండా పడతాయనే ఎంఐఎం ఆశిస్తోంది.

అభివృద్ధికి ఆమడదూరంలో..?

హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని, సుమారు 40 యేండ్లుగా ఎంఐఎం నియోజకవర్గం అభివృద్ధికి ఏం చేసింది? ఓటర్లు ఒకసారి ఆలోచించండి అని బీజేపీ అభ్యర్థి మాధవీలత ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. హిందువులు, ముస్లీంలు అనే తేడా నాకు లేదు, పాతబస్తీ కూడా ఇతర నియోజకవర్గాల మాధిరిగా అభివృద్ధి చెందాలని, ఇందుకు బీజేపీకి ఓట్లు వేయండని ఆమె ఓటర్లును అభ్యర్థిస్తున్నారు. ఇది ఓటర్లను ఆలోచించేలా చేస్తోంది. మైనార్టీలు కూడా ఆమె చేస్తున్న ప్రసంగాల పట్ల ఆకర్షితులౌతున్నారు. దీంతో ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకునే అవకాశం వచ్చిందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.

అందరిలో పెరిగిన ఆసక్తి..

హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఫలితం ఎలా ఉండబోతుంది? గత ఎన్నికల ఫలితాలే పునరావృతమౌతాయి? బీజేపీ పరిస్థితి ఏమిటీ? అనేది అందరిలో ఆసక్తిని కల్గిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో ప్రత్యర్థి పార్టీలు ఎంఐఎంకు గట్టి పోటీనిచ్చాయి. నియోజకవర్గం పరిధిలో మలక్‌పేట్, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణ్‌గుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా సెగ్మెంట్లు ఉన్నాయి. వీటిల్లో మలక్‌పేట్, కార్వాన్, గోషామహల్, చాంద్రాయణ్‌గుట్ట నియోజకవర్గాలలో జరిగే పోలింగ్ సరళి గెలుపు, ఓటములను నిర్దేశిస్తుందనే టాక్ నడుస్తోంది. ఆయా అసెంబ్లీ సెగ్గెంట్లలో హిందువుల ఓట్లు అధికంగా పోలయ్యేలా చూడాలని బీజేపీ నాయకత్వం సూచించినట్లుగా తెలిసింది. ఇదే జరిగితే ఫలితం తారుమారు అయ్యే అవకాశం లేకపోలేదని పార్టీ అంచనా వేస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఫలితం అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది.

Next Story

Most Viewed