ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నా.. ‘దిశ’తో మనసులో మాట బయటపెట్టిన రంజిత్ రెడ్డి

by GSrikanth |
ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నా.. ‘దిశ’తో మనసులో మాట బయటపెట్టిన రంజిత్ రెడ్డి
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: ఓ ప్రజాప్రతినిధిగా రాజకీయాలకు అతీతంగా పనిచేయాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా అవకాశం ఇచ్చింది. అయినప్పటికీ పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలందరికీ సేవ చేశాను. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో పనిచేసేందుకు కాంగ్రెస్​పార్టీలో చేరాను. కోళ్ల దాణా, అంగన్‌వాడీలకు పంపిణీ చేసే గుడ్లల్లో స్కాం జరిగిందని ప్రతిపక్ష పార్టీ నేత ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలతో నిరూపించకుండా ఆరోపణలు చేయడం తగదన్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు పక్కకు పెట్టి గడిచిన పదేండ్ల కాలంలో నేను, మీరు ఎంపీగా ఏం సాధించామో ప్రజలకు వివరిద్దామని సవాల్ చేశారు. పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు ఇదే నా విన్నపం ‘పిలిస్తే పలికే నాయకుడికి ఓటేసి గెలిపించండి.. అపాయింట్‌మెంట్ ఉంటేనే కలుస్తా అనే నాయకుడిని ఓడించండి’ అంటూ చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి దిశ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

అవకాశాల కోసమే పార్టీ మారారా..?

అధికార పార్టీలో ఉంటే ప్రజా సేవ మరింత సులభం అవుతుంది. ఈ మాట ఎప్పుడూ మాజీ సీఎం కేసీఆర్​చేబుతున్న విషయం. నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత వ్యక్తిగత వ్యాపారం కోసం పైరవీలు చేసినట్లు ఎవరైన రుజువు చేస్తే దేనికైనా సిద్ధమే. కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమావేశం సీఎం రేవంత్​ రెడ్డి సమక్షంలో జరిగింది. ఆ సమావేశంలో నా వ్యక్తిగత పనుల కోసం వస్తే పనిచేయొద్దని నిర్మొహమాటంగానే తెలియజేశాను. అక్కడే నా కమిట్‌మెంట్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను.

ఐదేండ్లుగా సాధించిన అభివృద్ధి ఏమిటి?

అప్పా జంక్షన్ నుంచి మన్నేగూడ వరకు ఫోర్​వే లైన్​ కోసం పోరాటం చేశాను. ఆ రోడ్డు పనులను మంజూరు, టెండర్లు ఫైనల్ చేశాము. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీతో శంకుస్థాపన చేయించాము. ఎన్‌జీటీ కేసుతో తాత్కాలికంగా పనులు నిలిచిపోయాయి. 111 జీవో రద్దు చేసేందుకు తీవ్ర ప్రయత్నం చేశాం. అందుకోసం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పూర్తి్స్థాయిలో అమలు చేసేందుకు చేయాల్సిన టెక్నికల్ విషయంతో పెండింగ్‌లో ఉంది. వికారాబాద్‌లోని అండర్ ప్రాసింగ్ రైల్వే ట్రాక్ పూర్తి చేశాము. విద్యా, ఉద్యోగాల కల్పన కోసం నిరంతరం శ్రమించాను.

రహదారి క్రెడిట్ బీజేపీదేనని కొండా అంటున్నారు

అప్పా జంక్షన్ నుంచి మన్నేగూడ వరకు మంజూరు చేసిన రహదారి జీవో కాపీ, టెండర్ కాపీలను చూస్తే ఎప్పుడు, ఎవరు ఎంపీగా ఉన్నప్పుడు జరిగిందో తెలుస్తుంది. ప్రతిపక్ష అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటు నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎన్ని నిధులు తీసుకొచ్చామో చర్చకు సిద్ధమా అని సవాల్ చేస్తున్నాను. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్​ నేతృత్వంలోనే ఆయన, నేను పనిచేశాము. నా కంటే ఆయనకే కేసీఆర్ కుటుంబంతో అత్యంత సన్నిహితుడిగా పేరుంది. మా ఇద్దరిలో ఎవరు ఏం చేశారో ప్రజల్లోకి వెళ్లి అడిగితే తెలుస్తుంది.

గ్రూపు రాజకీయాలను ఎలా అధిగమిస్తారు

గ్రూపులు లేకుండా ఏ పార్టీ లేదు. బీఆర్ఎస్, బీజేపీలో కూడా గ్రూపు రాజకీయాలున్నాయి. కానీ నేను గ్రూపు రాజకీయాలకు అతీతంగా పనిచేసుకుంటూ వెళ్తాను. నాకు వ్యక్తిగత స్వార్థాలు లేవు. కేవలం పార్టీ లైన్‌లోనే పనిచేసుకుంటా పోతాను. నేను ఎవరికి పోటీ కాదు... నాకు ఎవరు పోటీ ఉండరు. బీఆర్ఎస్‌లో గ్రూపు రాజకీయాలున్నప్పటికీ పార్టీ చెప్పిన పద్ధతిలోనే పనిచేసుకుంటూ పోయాను.

బీఆర్ఎస్ అవకాశం ఇచ్చినా కాంగ్రెస్‌లో ఎందుకు చేరారు

అధికార పార్టీ నేతలతోనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సాధ్యమైనంత వరకు అభివృద్ధి అందించాను. కాంగ్రెస్​ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తోందని ప్రజల్లో ఉంది. ఇలాంటి పరిస్థితిల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే ఓడిపోయే అవకాశం ఉందని నా సన్నిహితులు, మేధావులు తెలిపారు. ఇదే విషయాన్ని కేసీఆర్, కేటీఆర్లకు నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పాను. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం అందింది. పోటీ చేయనని సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేశాను. ఈ విషయంపై నాతోటి మిత్రులతో చర్చించినప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలో ఉంది. ఎంపీగా గెలిస్తే ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం ఉంటుందని కాంగ్రెస్లో చేరాను.

సాగు ప్రాజెక్టుల కోసం ఏం చేస్తారు?

చేవెళ్ల–ప్రాణహిత, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులతో చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని ప్రాంతాలు సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది. గత ప్రభుత్వం చేవెళ్ల–ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌గా మార్పు చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో చేవెళ్ల పార్లమెంటు ప్రాంతానికి సాగు జలాలు అందించే కార్యక్రమం నడుస్తోంది. అయితే ఇవన్నీ టెక్నికల్ విషయాలు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుంది.

విద్యా, వైద్య రంగాలపై మీ అభిప్రాయం ఏంటి

విద్యా, వైద్యం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే సంక్షేమ పథకాలు అవసరం లేదు అనేది నా భావన. ఎందుకంటే నేడు విద్యా, వైద్యానికి అయ్యే ఖర్చులు సామాన్యుడు తట్టుకోలేకపోతున్నారు. ఎన్ని కోట్ల నిధులైనా ఈ రంగాలకు వెచ్చించొచ్చు. నేను వ్యక్తిగతంగా విద్యా, వైద్యా రంగాల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తాను.

ప్రజలకు మీరు ఇచ్చే సందేశం

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిని ఆశీర్వదించండి. ప్రజా అవసరాల కోసం పనిచేసే నేతలను గుర్తించాలని కోరుతున్నాను. చివరగా నేను చెప్పేది ఒక్కటే పిలుస్తే పలికే నేతను ఎంపీగా గెలిపించండి.. అపాయింట్‌మెంట్ ఉంటేనే కలుస్తా అనే నాయకులను ఓడించాలని పిలుపునిస్తున్నాను.

Advertisement

Next Story