నాగర్ కర్నూలు ఎంపీ రాములుకు ఏం తక్కువ చేశాం: కేసీఆర్

by GSrikanth |
నాగర్ కర్నూలు ఎంపీ రాములుకు ఏం తక్కువ చేశాం: కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీలో చేరిన నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములులపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు రోజురోజుకూ దిగజారిపోతోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి వందరోజులు కూడా పూర్తికాకముందే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోందని అన్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు అలవిగాని హామీలిచ్చారని ఎద్దేవా చేశారు. అమలు చేయడం చేతకాక హామీలపై నాలుక మడతపెట్టి తిట్టకు దిగుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉన్నవారు డబ్బులు లేవని చెప్పడం సరికాదని హితవు పలికారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరుకు ఎంతో చేశామని.. ఇక్కడ ఓడిపోవాల్సింది కాదని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పాలమూరు-రంగారెడ్డి కాల్వలు పూర్తి చేసి నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల అనాలోచిత చర్య అన్నారు. దుష్ప్రచారం నమ్మి ఓట్లేసిన వారికి ఇప్పుడు వాస్తవాలు తెలుస్తున్నాయని వెల్లడించారు. దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే ఇవాళ బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నామని అన్నారు. నాగర్ కర్నూలు ఎంపీ రాములుకు ఏం తక్కువ చేశామని పార్టీ మారాడని ప్రశ్నించారు. ఎంపీ రాములుతో పాటు ఆయన కుమారుడికి కూడా అవకాశాలు కల్పించామని తెలిపారు. రాజకీయాల్లో అవకాశవాదులు వస్తుంటారు.. పోతుంటారని కార్యకర్తలే చివరివరకు జెండాను మోస్తారని అన్నారు. నిత్యం ప్రజల్లో ఉండేవారికి ఇవాళ కాకపోతే రేపు మంచిరోజు ఉంటుందని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed