ఉత్కంఠ పోరులో కోల్‌కతా చేతిలో హైదరాబాద్ ఓటమి.. క్లాసెన్ పోరాటం వృథా

by Harish |
ఉత్కంఠ పోరులో కోల్‌కతా చేతిలో హైదరాబాద్ ఓటమి.. క్లాసెన్ పోరాటం వృథా
X

దిశ, స్పోర్ట్స్ : హైదరాబాద్ ఓటమి.. కోల్‌కతా పెట్టిన 209 పరుగుల లక్ష్యం చూసిన తర్వాత చాలా మంది ఇదే ఊహించి ఉంటారు. అదే జరిగింది కూడా. కానీ, చిత్తుగా ఓడుతుందనుకున్న హైదరాబాద్ చివరి బంతి వరకు పోరాడటం విశేషం. క్లాసెన్ మెరుపులతో గెలిచేలా కనిపించింది కూడా. కానీ, ఆఖరికి ఆశలు రేపి ఊసురుమనిపించింది. గెలుపునకు దగ్గరగా వచ్చి ఆగిపోయింది.

ఐపీఎల్-17ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమితో మొదలుపెట్టింది. కోల్‌కతా వేదికగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో 4 పరుగుల తేడాతో పోరాడి ఓడింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 208/7 స్కోరు చేసింది. రస్సెల్(64 నాటౌట్, 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(54) హాఫ్ సెంచరీతో మెరిశాడు. రమన్‌దీప్(35), రింకు సింగ్(23) విలువైన పరుగులు జోడించారు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్(3/32) సత్తాచాటాడు. అనంతరం 209 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 204/7 స్కోరుకే పరిమితమైంది. జట్టును గెలిపించేందుకు క్లాసెన్(63, 29 బంతుల్లో 8 సిక్స్‌లు) చేసిన పోరాటం వృథా అయ్యింది. హాఫ్ సెంచరీతోపాటు 2 వికెట్లు తీసి కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించిన రస్సెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

చివరి మూడు ఓవర్లలోనే ఆశలు.. నిరాశ

హైదరాబాద్ ఆట గురించి చెప్పుకోవాలంటే ఆఖరి మూడు ఓవర్ల గురించే మాట్లాడుకోవాలి. 18, 19 ఓవర్లలో హైదరాబాద్ గెలుపు ఆశలు రేకెత్తగా.. 20వ ఓవర్‌లో అంచనాలు తలకిందులయ్యాయి. అంతకుముందు భారీ పరుగుల లక్ష్య ఛేదనలో హైదరాబాద్‌కు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(32), అభిషేక్ శర్మ(32) మంచి ఆరంభమే అందించారు. తొలి వికెట్‌కు ఈ జోడీ 60 పరుగులు జోడించింది. అయితే, కేకేఆర్ బౌలర్లు పంజుకోవడంతో స్వల్ప వ్యవధిలోనే వీరు మైదానం వీడారు. అలాగే, రాహుల్ త్రిపాఠి(20), మార్‌క్రమ్(18), అబ్దుల్ సమద్(15) క్రీజులో నిలువకపోవడంతో ఎస్‌ఆర్‌హెచ్ 17 ఓవర్లు పూర్తయ్యేసరికి 149/5 స్కోరుతో నిలిచింది. హైదరాబాద్ గెలవాలంటే 18 బంతుల్లో 60 పరుగులు చేయాలి. భారీ ఓటమి ఖాయమే అనుకున్న తరుణంలో.. అప్పటికే క్రీజులో కుదురుకున్న క్లాసెన్ మెరుపులతో ఒక్కసారిగా ఆశలు రేపాడు. సిక్స్‌ల వర్షం కురిపించిన అతను 18వ ఓవర్‌లో 21 పరుగులు, 19వ ఓవర్‌లో 26 పరుగుల పిండుకున్నాడు. దీంతో లక్ష్యం 6 బంతుల్లో 13గా మారింది. చివరి ఓవర్‌లో తొలి బంతికే క్లాసెన్ సిక్స్ కొట్టడంతో హైదరాబాద్ గెలుపు ఖాయమే అనుకున్నారంతా. ఇక్కడే బౌలర్ హర్షిత్ రానా అద్భుతం చేశాడు. చివరి నాలుగు బంతుల్లో షాబాజ్ అహ్మద్(16), క్లాసెన్(63)లను అవుట్ చేసిన అతను రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో హైదరాబాద్ అభిమానులు నిరాశ చెందగా.. కోల్‌కతా అభిమానులు విజయానందంలో మునిగిపోయారు.

రస్సెల్ విధ్వంసం.. మెరిసిన ఫిలిప్ సాల్ట్

అంతకుముందు కోల్‌కతా ఇన్నింగ్స్ ఆరంభంలో తడబడుతూనే సాగింది. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆ జట్టు 51/4 స్కోరుతో కష్టాల్లో పడింది. సునీల్ నరైన్(2), వెంకటేశ్ అయ్యర్(7), శ్రేయస్ అయ్యర్(0), నితీశ్ రాణా(9) నిరాశపరిచారు. మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(54) మాత్రం జట్టుకు అండగా నిలిచాడు. సాల్ట్ హాఫ్ సెంచరీతో మెరవడం, అతనికి రమన్‌దీప్ సింగ్(35) తోడవడంతో కోల్‌కతా 105/4 స్కోరుతో పోటీలోకి వచ్చింది. ఆ తర్వాత వీరిద్దరూ స్వల్ప వ్యవధిలోనే అవుటయ్యారు. క్రీజులోకి వచ్చిన రస్సెల్(64 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. రింకు సింగ్(23)తో కలిసి బౌలర్లను ఊచకోతకోశాడు. ఈ క్రమంలో 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రస్సెల్ ఆఖరి ఐదు ఓవర్లలో 85 పరుగులు పిండుకోవడంతో కోల్‌కతా 200 పరుగుల మార్క్‌ను దాటింది. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో నటరాజన్ 3 వికెట్లు, మార్కండే 2 వికెట్లు తీయగా.. కమిన్స్‌కు ఒక్క వికెట్ దక్కింది.

స్కోరుబోర్డు

కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ 208/7(20 ఓవర్లు)

సాల్ట్(సి)జాన్సెన్(బి)మార్కండే 54, నరైన్ రనౌట్(షాబాజ్) 2, వెంకటేశ్ అయ్యర్(సి)జాన్సెన్(బి)నటరాజన్ 7, శ్రేయస్ అయ్యర్(సి)కమిన్స్(బి)నటరాజన్ 0, నితీశ్ రాణా(సి)త్రిపాఠి(బి)మార్కండే 9, రమన్‌దీప్(సి)మార్కండే(బి)కమిన్స్ 35, రింకు సింగ్(సి)మార్‌క్రమ్(బి)నటరాజన్ 23, రస్సెల్ 64 నాటౌట్, స్టార్క్ 6 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 8.

వికెట్ల పతనం : 23-1, 32-2, 32-3, 51-4, 105-5, 119-6, 200-7

బౌలింగ్ : భువనేశ్వర్(4-0-51-0), జాన్సెన్(3-0-40-0), నటరాజన్(4-0-32-3), కమిన్స్(4-0-32-1), మార్కండే(4-0-39-2), షాబాజ్ అహ్మద్(1-0-14-0)

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ : 204/7(20 ఓవర్లు)

మయాంక్(సి)రింకు(బి)హర్షిత్ 32, అభిషేక్(సి)చక్రవర్తి(బి)రస్సెల్ 32, రాహుల్(సి)హర్షిత్(బి)నరైన్ 20, మార్‌క్రమ్(సి)రింకు(బి)చక్రవర్తి 18, క్లాసెన్(సి)సూయశ్(బి)హర్షిత్ 63, అబ్దుల్ సమద్(సి)వెంకటేశ్(బి)రస్సెల్ 15, షాబాజ్(సి)శ్రేయస్(బి)హర్షిత్ 16, జాన్సెన్ 1 నాటౌట్, కమిన్స్ 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 7.

వికెట్ల పతనం : 60-1, 71-2, 107-3, 111-4, 145-5, 203-6, 204-7

బౌలింగ్ : స్టార్క్(4-0-53-0), హర్షిత్(4-0-33-3),వరుణ్(4-0-55-1),నరైన్(4-0-19-1), రస్సెల్(2-0-25-2), సూయశ్(2-0-18-0)

Advertisement

Next Story

Most Viewed