ఆ నిబంధన ఉల్లంఘించిన గిల్.. రూ. 12 లక్షల ఫైన్

by Harish |
ఆ నిబంధన ఉల్లంఘించిన గిల్.. రూ. 12 లక్షల ఫైన్
X

దిశ, స్పోర్ట్స్ : చెన్నయ్ సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన బాధలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు మరో షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ఐపీఎల్ నిర్వాహకులు భారీ జరిమానా విధించారు. మంగళవారం చెన్నయ్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో నిర్ణీత సమయంలోగా తమ బౌలింగ్ కోటాను పూర్తి చేయలేకపోయింది. దీంతో స్లో ఓవర్‌రేట్ కారణంగా గిల్‌కు రూ. 12 లక్షలు జరిమానా విధించినట్టు ఐపీఎల్ నిర్వాహకులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ సీజన్‌లో గుజరాత్ జట్టు స్లో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘించడం ఇది తొలిసారి. ఐపీఎల్ ప్రవర్తనా నియామవళి ప్రకారం.. స్లో ఓవర్ రేట్ నిబంధన ఉల్లంఘనకు పాల్పడిన మొదటి సారి కెప్టెన్‌కు రూ. 12 లక్షలు జరిమానా విధిస్తారు. ఈ సీజన్‌లో మిగతా మ్యాచ్‌ల్లో స్లో ఓవర్ రేట్ నిబంధన ఉల్లంఘనను పునరావృతం చేస్తే జరిమానా పెరుగుతుంది. రెండోసారి ఉల్లంఘిస్తే కెప్టెన్‌‌కు రూ. 24 లక్షలు ఫైన్ విధించడంతోపాటు ఆటగాళ్లకు రూ. 6 లక్షలు లేదా మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత పెడతారు. మూడోసారి ఉల్లంఘిస్తే కెప్టెన్‌కు రూ. 30 లక్షలు ఫైన్ వేయడంతోపాటు ఒక మ్యాచ్‌ నిషేధం విధిస్తారు. అంతేకాకుండా, ఆటగాళ్లకు రూ. 12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాగా విధిస్తారు. ఆ తర్వాత కూడా నిబంధనను ఉల్లంఘిస్తే మూడోసారి తీసుకున్న చర్యలనే కొనసాగిస్తారు.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్ రెండు మ్యాచ్‌లు ఆడింది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించి లీగ్‌ను విజయం ఆరంభించిన విషయం తెలిసిందే. మంగళవారం చెన్నయ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో గుజరాత్ చిత్తుగా ఓడింది. బంతితోపాటు బ్యాటుతోనూ తేలిపోయిన ఆ జట్టు 63 పరుగుల తేడాతో చెన్నయ్‌ చేతిలో భారీ ఓటమిని చవిచూసింది.

Advertisement

Next Story