దారుణం....వీధి కుక్కల దాడిలో 10 నెలల బాలుడు మృతి

by Sridhar Babu |
దారుణం....వీధి కుక్కల దాడిలో 10 నెలల బాలుడు మృతి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పది నెలల పసికందు వీధి కుక్కలకు బలయ్యాడు. ఈ విషాదకరమైన ఈ సంఘటన బోధన్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్ పట్టణం బస్టాండ్ ప్రాంతంలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్న ఓ మహిళ తన 10 నెలల కొడుకు కనిపించడం లేదని బోధన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు బస్టాండ్ ప్రాంతంలోని పొదల్లో పసివాడి శరీర భాగాలు కనిపించాయి. బాలుడి తల్లి బస్టాండ్ ప్రాంతంలో బహిర్భూమికి వెళ్లే క్రమంలో బాబును ఓచోట ఉంచి వెళ్లింది. తిరిగి వచ్చేసరికి బాబును ఉంచినచోట కనిపించపోవడంతో చుట్టుపక్కల వెతికింది.

బాబు కోసం అందరినీ అడిగి ఆరా తీసింది. ఎక్కడా బాబు ఆచూకీ కనిపించకపోవడంతో స్థానికుల సలహా మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాబు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు బాబు మిస్సయిన ప్రాంతంలోనే పొదల్లో పసివాడి శరీర భాగాలు కనిపించాయి. బహుశా పోలీసులకు లభ్యమైన పసివాడి శరీర భాగాలు మిస్సయిన బాధిత మహిళ కొడుకు శరీర బాగాలేనేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాడీ పార్ట్స్ ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు బోధన్ సీఐ వెంకటనారాయణ తెలిపారు.

ఇది వీధి కుక్కల పనే..!

వీధి కుక్కలే పసివాడిని నోట కరుచుకొని వెళ్లి పీక్కు తినేశాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో కుక్కల బెడద తీవ్రమవుతుండడంతో జిల్లా అంతటా ప్రజలు కుక్కల బెడద పై తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బోధన్ పట్టణంలో పసివాడి శరీర భాగాలు వేరుచేసి చంపేలా కుక్కలు పీక్కుతిన్న సంఘటన జిల్లా ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. బడికి వెళ్లే పిల్లలను బయటికి పంపాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితులున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల బెడదతో కంటిమీద కునుకు దూరమైందని జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వీధి కుక్కల స్వైర విహారాన్ని నియంత్రించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, ప్రజల విలువైన ప్రాణాలను కాపాడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed