Cyber crime : యాప్ ఇన్స్టాల్ చేయగానే రూ. 2 లక్షల ముప్పై వేలు హాంఫట్

by Sridhar Babu |
Cyber crime : యాప్ ఇన్స్టాల్ చేయగానే రూ. 2 లక్షల ముప్పై వేలు హాంఫట్
X

దిశ, కొత్తగూడ : బ్యాంకు లోగోతో వస్తున్న మోసపూరిత ఏపీకే ఫైల్ ని ఇన్స్టాల్ చేసుకున్నాడో ఓ యువకుడు. యాప్ అప్డేట్ కోసం అంటూ మెసేజ్ రావడంతో అనుమానించలేదు. గంటల వ్యవధిలో తన ఖాతాలో డబ్బులన్నీ ఖాళీ అవడంతో ఖంగుతిన్న సంఘటన మహబూబాబాద్ జిల్లా లోని గంగారం మండలంలోని పెద్ద ఎల్లాపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన గుండగాని శ్రీధర్ కి ఇండియన్ బ్యాంకులో ఖాతా ఉంది. ఈ క్రమంలో ఇండియన్ బ్యాంకు యాప్ పేరుతో స్మార్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని శ్రీధర్ మొబైల్ కి మెసేజ్ వచ్చింది.

బ్యాంకు నుండి వచ్చిందని భావించిన శ్రీధర్ ఏపీకే ఫైల్ ని డౌన్లోడ్ చేసుకున్నాడు. ఇదిలా ఉండగా ఫైల్ డౌన్లోడ్ చేసిన అనంతరం గుర్తు తెలియని వ్యక్తి నుండి లోన్ ఇస్తామని, ఓటీపీ చెప్పమంటు కాల్ రావడంతో అనుమానం వ్యక్తం చేశాడు. ఓటీపీ చెప్పేందుకు నిరాకరించాడు. సమస్య తీరిందనుకున్న శ్రీధర్ కి కొన్ని గంటల వ్యవధిలో అతని ఖాతా నుండి రూ. 2 లక్షల 30వేలు కట్ అయినట్లు మెసేజ్ రావడంతో లబోదిబోమన్నాడు. సైబర్ మోసగాళ్ల పనేనని గుర్తించిన శ్రీధర్ సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశారు. గంగారం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న బాధితుడు పెద్ద మొత్తంలో డబ్బులు పోవడంతో బోరున విలపించాడు. ఈ ఘటనపై గంగారం ఎస్సై రవి కుమార్ ని వివరణ కోరగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి : ఎస్సై రవికుమార్

సైబర్‌ నేరగాళ్లు కొత్తకొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. వీటికి సంబంధించి గ్రామాల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో అవగాహన కల్పిస్తున్నాం. అపరిచితుల నుంచి వచ్చే ఆఫర్లు, లాటరీలు, డిస్కౌంట్లను నమ్మవద్దు. ఎవరూ ఊరికే మనకు బహుమతులు ఇవ్వరు. డబ్బులు పంపరు. ఒక్క క్లిక్‌తో లోన్‌ ఇస్తామని నమ్మిస్తూ పలు యాప్‌లు లోన్లు లింకులు పంపిస్తుంటారు. వీటిపై అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వాటిల్లో లోన్ తీసుకుని మొత్తం కట్టేసినా..ఇంకా కట్టాల్సి ఉందని మెసేజీలతో వేధిస్తాయి. ఇలాంటి వేధింపులతో ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు.

అందుకే దాదాపుగా లోన్‌ యాప్‌లకు దూరంగా ఉండాలి. అనుమానాస్పదంగా ఉండే లింక్‌లు ఓపెన్‌ చేయకపోవడమే మంచిది. వాట్సాప్ గ్రూపులో ఇతర వాటిలో వివిధ నోటిఫికేషన్లు వస్తే వాటిని ఓపెన్‌ చెయ్యకపోవడమే మంచింది. డబ్బుల సంపాదనకు షార్ట్‌కట్‌ రూట్స్‌ అసలే ఉండవు. శ్రమించాలన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరూ ఇలాంటి మోసాలకు గురి కావద్దు. మొబైల్ కి ఓటీపీలు వస్తే ఎవరికి చెప్పొద్దని గంగారం ఎస్ఐ రవికుమార్ తెలిపారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Advertisement

Next Story