మేం మోడీ ఆరాధకులం.. జ్యోతిష్ పీఠ్‌ శంకరాచార్య స్వామి వ్యాఖ్య

by Hajipasha |
మేం మోడీ ఆరాధకులం.. జ్యోతిష్ పీఠ్‌ శంకరాచార్య స్వామి వ్యాఖ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: అసంపూర్తిగా ఉన్న అయోధ్య రామమందిరంలో శ్రీరాముడికి ప్రాణ ప్రతిష్ఠ చేయడం సరికాదని ఇటీవల వ్యాఖ్యానించిన ఉత్తరాఖండ్‌లోని జ్యోతిష్ పీఠ్‌కు చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద ప్రధాని మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. హిందువుల ఆత్మగౌరవానికి ప్రాధాన్యతనిచ్చే ప్రధాని మోడీని ఆరాధించేవారిలో తాను ఒకడినని ఆయన చెప్పారు. ‘‘నిజం ఏమిటంటే.. ప్రధాని మోడీ హిందువులకు ఆత్మజ్ఞానాన్ని కలిగించారు. ఇది చిన్న విషయం కాదు. మేం మోడీకి వ్యతిరేకులం కాదు. మేం ఆయన ఆరాధకులం అని చాలాసార్లు బహిరంగంగా చెప్పాం. ఇంతకుముందు మోడీలా హిందువులను బలపర్చిన మరో భారత ప్రధాని ఎవరైనా ఉంటే చెప్పండి. మన దేశానికి చాలా మంది ప్రధానులయ్యారు. అలా అని మేం ఎవరినీ విమర్శించడం లేదు’’ అని శంకరాచార్య తెలిపారు. ‘‘ఆర్టికల్ 370 రద్దు చేయబడినప్పుడు మేం స్వాగతించలేదా? పౌరసత్వ సవరణ చట్టం వచ్చినప్పుడు మేం పొగడలేదా? ప్రధాని మోడీ స్వచ్ఛతా అభియాన్‌ను మేం అడ్డుకున్నామా? రామజన్మభూమిలో రామమందిరాన్ని నిర్మించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగలేదని కూడా మేం ప్రశంసించాం’’ అని శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద పేర్కొన్నారు. ‘‘దేశంలో హిందువులు బలపడినప్పుడల్లా మేం సంతోషించాం. నరేంద్ర మోడీ ఇప్పుడు చేస్తున్నది అదే పని’’ అని తెలిపారు.

Advertisement

Next Story