అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠపై సంచలన ‘పిల్’

by Hajipasha |
అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠపై సంచలన ‘పిల్’
X

దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామమందిరంలో జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరగనున్న తరుణంలో అలహాబాద్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన భోలా దాస్ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం పుష్య మాసం నడుస్తోందని.. ఈ మాసంలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు జరగవని ఆయన పేర్కొన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హడావుడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని పిటిషన్‌లో ఆరోపించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి నలుగురు శంకరాచార్యులు లేవనెత్తిన అభ్యంతరాలను కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈవిధంగా శ్రీరాముడిని ప్రతిష్ఠించడం సనాతన సంప్రదాయానికి విరుద్ధమని కోర్టులో వాదన వినిపించారు. ఈ పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాలని భోలా దాస్ తరఫు న్యాయవాది డిమాండ్‌ చేశారు. అయోధ్య రామమందిరం నిర్మాణ దశలోనే ఉందని.. అసంపూర్తిగా ఉన్న ఆలయంలో ఎలాంటి దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదన్నారు. ‘‘జనవరి 22న రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో భజనలు, కీర్తనలు నిర్వహించాలి. రామచరిత్ మానస్ పఠించాలి. అన్ని నగరాల్లో రథ, కలశ యాత్ర చేపట్టాలి’’ అంటూ యోగి సర్కారు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది.

Advertisement

Next Story

Most Viewed