అదిగో.. అల్లదిగో.. అయోధ్య రాముడి దివ్య స్వరూపం

by Hajipasha |
అదిగో.. అల్లదిగో.. అయోధ్య రాముడి దివ్య స్వరూపం
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎట్టకేలకు అయోధ్య రామయ్య దివ్య స్వరూపం దర్శనమిచ్చింది. జనవరి 22న రామమందిరంలో ప్రాణ ప్రతిష్ఠ చేయనున్న రాముడి విగ్రహాన్ని గురువారమే గర్భగుడిలోకి తీసుకెళ్లగా.. దేవతామూర్తి మొహంపై కట్టిన వస్త్రాన్ని ప్రత్యేక పూజల అనంతరం శుక్రవారం మధ్యాహ్నం తొలగించారు. దీంతో బాలరాముడి సుందర స్వరూపం భక్తజనులకు కనువిందు చేసింది. బంగారు వర్ణపు విల్లు, బాణాలను చేతపట్టి.. చిరునవ్వును చిందిస్తూ.. జీవకళ ఉట్టిపడేలా నిలబడి ఉన్న భగవాన్ శ్రీరాముడి విగ్రహం కనిపించింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐదేళ్ల బాలరాముడి ఈ విగ్రహాన్ని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేశారు. ఈ విగ్రహం ఎత్తు 5 అడుగులు. జనవరి 22న అభిజిత్ ముహూర్తంలో ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఆ రోజున భద్రతా కారణాల దృష్ట్యా కేవలం కొంత మంది అతిథులనే ఆలయంలోకి అనుమతించనున్నారు. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ఉదయం అయోధ్యలోని హనుమాన్ గర్హీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామమందిరం నిర్మాణ పనులను సమీక్షించారు. సోమవారం రామమందిర ప్రారంభోత్సవానికి హాజరయ్యే అతిథులు ఇన్విటేషన్ కార్డుతో పాటు తప్పనిసరిగా విజిటింగ్ పాస్‌‌ను తీసుకెళ్లాలి. దానిపై ఉన్న క్యూఆర్ కోడ్‌‌ను స్కాన్‌ చేస్తేనే లోపలికి వెళ్లేందుకు అనుమతిస్తారు.

Advertisement

Next Story

Most Viewed