86 మంది ఉసురు తీసిన కల్తీ మద్యం

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్‌లో కల్తీ మద్యం వ్యవహారం కలకలం రేపుతోంది. కల్తీ మద్యం తాగి పదుల సంఖ్యల్లో అమాయకులు మృతి చెందారు. దీంతో తమపై ఆధారపడ్డ కుటుంబాలు రొడ్డున పడ్డాయి. బాధిత కుటుంబీకులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 2 లక్షల పరిహారం ప్రకటించింది.

అయితే, శనివారం నాటికి కల్తీ మద్యం కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 86కి చేరింది. శుక్రవారం నాటికి 38 మంది మృతి చెందగా.. గత 24 గంటల్లో చికిత్స పొందుతూ.. 48 మంది చనిపోవడం బాధాకరం. ఈ ఘటనపై సీఎం అమరీందర్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కల్తీ మద్యం స్థావరాలపై ఉక్కుపాదం మోపుతున్నారు.

దాదాపు 100 కు పైగా కేంద్రాల్లో దాడులు జరిగినట్టు సమాచారం. మొత్తం 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇటువంటి దారుణాలు జరుగుతున్నా నిర్లక్ష్యం వహించిన ఎక్సైజ్ అధికారులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అధికారుల అలసత్వంతో అమాయకుల ప్రాణాలు పోయాయని.. బాధితు కుటుంబాలకు అండగా నిలవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement