లాక్‌డౌన్ ఎఫెక్ట్.. జీఎస్టీ చెల్లింపుల నుంచి రిలీఫ్ ఇస్తారా!?

by Shyam |
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. జీఎస్టీ చెల్లింపుల నుంచి రిలీఫ్ ఇస్తారా!?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే కరోనా వ్యాప్తి కారణంగా నెల రోజులుగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. అన్ని రకాల సంస్థలు, ఫ్యాక్టరీలు, కార్యాలయాలు మూసేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. మరో వారం రోజుల్లో లాక్‌డౌన్ ఎత్తివేసే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయినా ఖచ్చితంగా ఎత్తేస్తారా లేదా అనేది ఆరోజు వరకు తెలీదు. ఒకవేళ లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటికీ దశల వారీగా అవసరమైన రంగాలకు అనుమతిస్తూ కొంతమేరకు కట్టడి చేసే అవకాశముంది. ఇదే క్రమంలో లాక్‌డౌన్ కారణంగా అన్ని రకాలుగా నష్టపోయిన వ్యాపారులను ఆదుకోవడానికి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

లాక్‌డౌన్ వల్ల స్వయం ఉపాధి పొందేవారు, సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల వారికి వ్యాపారం నడవక, రుణాలు చెల్లించలేని దారుణమైన పరిస్థితిలోకి నెట్టివేయబడ్డారు. ఉద్యోగాలున్నవారి పరిస్థితి సైతం ఇంతే..జీతాల్లో కోత వల్ల వారూ నష్టాల నుంచి తప్పించుకోలేని పరిస్థితి. ఈ క్రమంలో ఇదివరకూ ఇచ్చిన 3 నెలల రుణ వాయిదాలపై మారటోరియం అమలులాగే, జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, జీఎస్టీని కొంత కాలం వరకూ వాయిదా వేయడమా? పూర్తిగా రద్దు చేయడమా అనే మీమాంసలో ప్రభుత్వం ఉంది.

ప్రధానంగా కరోనా లాక్‌డౌన్ వల్ల అధికంగా నష్టపోయే హోటళ్లు, రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్, ఎయిర్‌లైన్స్, తయారీ రంగాలకే దీన్ని పరిమితం చేయనున్నారా? అన్ని రంగాలకూ వరిస్తుందా అనే విషయంలో చర్చలు నడుస్తున్నట్టు సమాచారం. లాక్‌డౌన్ నష్టాలు ఏ ఒక్క రంగానికే పరిమితమవలేదు, కాబట్టి ఏదోక రంగానికి మాత్రమే జీఎస్టీ మినహాయింపు ఇస్తే మిగిలిన రంగాల నుంచి విమర్శలతో పాటు డిమాండ్లు కూడా పెరిగే అవకాశముంది. మరో మార్గంలో..అన్ని రంగాలకు జీఎస్టీ చెల్లింపులను 3 నుంచి 6 నెలల వరకూ ఉపశమనం ఇవ్వడం వల్ల కొంత ఒత్తిడి తగ్గుతుందనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే..లక్షల్లో వ్యాపారులకు, కోట్ల మంది ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందినట్టే. అయితే, రద్దు చేసిన కాలానికి సంబంధించి ఎలాంటి పెనాల్టీలు, వడ్డీ ఉండకూడదని సూచనలు వినిపిస్తున్నాయి.

జీఎస్టీ అమలైన నాటి నుంచి ఇప్పటివరకూ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఏ నెలలోనూ రాబడి లేదు. కొన్నిసార్లు నెలకు రూ. లక్ష కోట్ల ఆదాయం రావడం కూడా కష్టమైన సందర్భాలున్నాయి. తక్కువ ఆదాయం కారణంగా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం తప్పలేదు. జీఎస్టీ విధానంలో గందరగోళం ఉండటం, జీఎస్టీ రేట్లు కూడా ఎక్కువ కావడంతో చిన్న చిన్న వ్యాపారులు జీఎస్టీలో రిజిస్టర్ చేసుకున్నప్పటికీ చెల్లించేందుకు ఆసక్తి చూపించడంలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇన్‌వాయిస్ విధానానికి తగినంత వెసులుబాటు కల్పించి, నగదు రూపంలో జరిగిన లావాదేవీలను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా, సంస్థలకు వాస్తవంగా వచ్చిన సొమ్ముపై మాత్రమే జీఎస్టీ చెల్లించే విధంగా ఉపశమనం ఇచ్చే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ చర్చలు సఫలమై జీఎస్టీని కొన్ని నెలల వరకూ పూర్తిగా రద్దు చేస్తే లక్షలాది మంది వ్యాపారులు కరోనా వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చుకోవచ్చు.

Tags: gst, coronavirus, covid-19, latest gst updates, GST payments

Advertisement

Next Story

Most Viewed