తెలంగాణలో ఒక్క నెలలో 49వేల కరోనా కేసులు

by  |
తెలంగాణలో ఒక్క నెలలో 49వేల కరోనా కేసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో నెలరోజుల వ్యవధిలో 49,320 కరోనా కేసులు నమోదయ్యాయి. 273మంది కరోనా కారణంగా చనిపోయారు. జూలై 1వ తేదీ నాటికి రాష్ట్రంలో 17,357 కరోనా కేసులుంటే ఆగస్టు 1 నాటికి అది 66,677కు చేరుకుంది. దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. మృతుల సంఖ్య సైతం 267 నుంచి 540కు చేరుకుంది. జూలై నెలలో అన్‌లాక్-2 మార్గదర్శకాల్లో భాగంగా కంటైన్‌మెంట్ జోన్లు మినహా రాష్ట్రమంతటా ఆంక్షలు సడలించడంతో ఊహించనంత స్థాయిలో కొత్త కేసులు ఉనికిలోకి వచ్చాయి. మరణాల రేటు జాతీయ సగటు కంటే తక్కువగా ఉందంటూ ప్రభుత్వం గంభీరంగా ఉన్నా పాజిటివ్ బారిన పడుతున్న ప్రజలు మాత్రం గుండెలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. హైదరాబాద్ నగరంకంటే వేగంగా జిల్లాల్లో కేసులు నమోదవుతూ ఉన్నాయి.

గడచిన 24గంటల వ్యవధిలో రాష్ట్రం మొత్తం మీద 1,891 కేసులు నమోదైతే అందులో కేవలం 517మాత్రమే హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. మిగిలిన 1,374 కేసులు జిల్లాల్లో నమోదైనవే. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు తోడు వరంగల్ అర్బన్, కరీంనగర్, సంగారెడ్డి, నిజామాబాద్ తదితర జిల్లాల్లో సైతం మూడంకెల స్థాయిలో కరోనా కేసులు నమోదవుతూ ఉన్నాయి. రాష్ట్ర వైద్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లాలో వారం రోజులుగా సగటున వంద కేసులు నమోదవుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ విడుదల చేసిన బులెటిన్‌లోని తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాబారిన పడినవారిలో 47,590 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా 18,547 మంది ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నారు. ఆసుపత్రుల్లో ఉన్న పేషెంట్లలో సుమారు మూడో వంతు మంది ఆక్సిజన్ లేదా ఐసీయూ వార్డుల్లోనే ఉన్నారు.

రాష్ట్రంలోని కరోనా కేసుల గణాంకాలను పరిశీలిస్తే…

అన్‌లాక్-1 (జూన్ 1-30) : 14,565 కొత్త కేసుల నమోదు
అన్‌లాక్-2 (జూలై 1-31) : 49,320 కొత్త కేసుల నమోదు
అన్‌లాక్-1లో : 179 కరోనా మృతులు
అన్‌లాక్-2లో : 273 కరోనా మృతులు
అన్‌లాక్-1 ప్రారంభం నాటికి మొత్తం కేసులు : 2,792; మృతులు : 88
అన్‌లాక్-2 ప్రారంభం నాటికి మొత్తం కేసులు : 17,357; మృతులు : 267
అన్‌లాక్-3 ప్రారంభం నాటికి మొత్తం కేసులు : 66.667; మృతులు : 540


Next Story