కరోనా గుప్పిట్లో టీచర్లు..!

by  |
కరోనా గుప్పిట్లో టీచర్లు..!
X

దిశ, న్యూస్​బ్యూరో :

డిజిటల్​ తరగతులను ప్రారంభించేందుకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఆగస్ట్​ 27 నుంచి ఉపాధ్యాయులను స్కూళ్లకు రావాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థులను క్లాసులు వినేలా చూడాలని సూచించినప్పటికీ తర్వాత తప్పనిసరిగా ఇంటింటికి వెళ్లి పరిశీలించాలని స్పష్టం చేసింది. ఆ రిపోర్ట్​ను రోజూ అధికారులకు ఉపాధ్యాయులు చేరవేయాల్సి ఉంటుంది. ఈ విధులు అప్పగించి శనివారానికి వారం రోజులు పూర్తయిన నేపథ్యంలో పరిశీలించగా టీచర్లు కూడా కరోనా బారిన పడుతున్నట్టు నిర్ధారణ అయ్యింది.

14 జిల్లాల్లో 400 మంది ఉపాధ్యాయులు కొత్తగా కరోనా బారిన పడినట్టు ‌‘దిశ’ సర్వేలో తేలింది. ఈ గణంకాలను ఆయా జిల్లాల ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా ధ్రువీకరించారు. వీరిలో దీర్ఘకాల అనారోగ్య సమస్యలున్నవారు, 50 ఏళ్లు పైబడిన వారూ ఉన్నారు. హృద్రోగ, డయాబెటిస్​, డయాలసిస్​ సమస్యలున్న టీచర్ల ప్రాణాలకు హామీ లేకుండా పోయిందని పలువురు వాపోతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో కొన్ని పాఠశాలల్లో ఎక్కువ మందికి కరోనా సోకింది. బయ్యారం మండలంలోని ఓ స్కూల్​లో ముగ్గురు టీచర్లు వైరస్​ అంటుకుంది. ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతుండటంతో స్కూళ్లకు వెళ్లకుండా.. విద్యార్థులను ఫోన్లలో మానిటరింగ్​ చేసే అవకాశం కల్వించాలని, పర్క్​ ఫ్రం హోం ఇవ్వాలని టీచర్లు కోరుతున్నారు.

ఇళ్లలోకి రావద్దంటున్న తల్లిదండ్రులు..

ఉపాధ్యాయులు విద్యార్థులను ఫొటోలు తీసేందుకు వెళ్తున్నా పిల్లల తల్లిదండ్రులు రానివ్వడం లేదు. ఎవరి నుంచి వైరస్​ అంటుతుందో తెలియని పరిస్థితుల్లో వందల మందిని టీచర్లను కలవాల్సి ఉంటుంది. దీంతో తమకు, పిల్లలకు కూడా కరోనా వస్తుందేమోనని తల్లిదండ్రులు భయపడుతున్నారు. తామే పిల్లలను చూసుకుంటామని, టీచర్లు రావాల్సిన అవసరంలేదని సున్నితంగానే తిరస్కరిస్తున్నారు. రిపోర్టులు రాని సందర్భాల్లో ఉపాధ్యాయులపై అధికారుల ఒత్తిడి పెరగడంతో తగిన పరిష్కారాన్ని చూపించాలని కోరుతున్నారు.

వరంగల్​ జిల్లాలోని ఓ ఉపాధ్యాయుడి అస్తమా, కిడ్నీ సంబంధ సమస్యలున్నాయి. గురువారం ఆయనకు కరోనా పాజిటివ్​ వచ్చింది. దీంతో ఆ పాఠశాల విద్యార్థుల్లో భయం పెరిగింది. మరోవైపు తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారిని, 50 ఏళ్లు పైబడిన ఉపాధ్యాయులను విధుల నుంచి మినహాయించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. మహబూబ్​బాద్​ జిల్లాలోని ఓ ఉపాధ్యాయుడు పదేళ్లుగా డయాబెటిక్​ సమస్యతో బాధపడుతున్నారు. ఆయనకు కరోనా సోకడంతో హోం క్వారంటైన్​లో ఉన్నారు. ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలున్న వారి హెల్త్​ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వర్క్​ ఫ్రమ్​ హోమ్​ ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

అనారోగ్యం ఉన్న వారిని మినహాయించాలి..

ఇంటింటికీ తిరుగుతున్న ఉపాధ్యాయుల్లో గుండె, కిడ్నీ, డయాబెటిక్​ పేషెంట్లున్నారు. వారిని మినహాయించాలని ప్రభుత్వానికి విన్నవించాం. వయసు ఎక్కువగా ఉన్నా, అనారోగ్య సమస్యలున్నా కరోనా పాజిటివ్ వస్తుంది కాబట్టి వారిని డ్యూటీల నుంచి మినహాయించాలి. కేంద్రం ఆదేశాలున్నా రాష్ట్ర విద్యాశాఖ పట్టించుకోవడం లేదు.

– మైస శ్రీనివాస్​, టీపీటీఎఫ్​ నాయకులు

కరోనా నుంచి రక్షణ కల్పించాలి..

రూరల్​ ఏరియాల్లోనే కరోనా కేసులు పెరుగుతున్నాయి. పాఠశాలకు, విద్యార్థుల ఇళ్లకు తిరుగుతున్న క్రమంలో వైరస్​ బారిన పడుతున్నారు. గతంలో వైద్యులు చేసినట్టుగానే టీచర్లు ప్రతి ఇంటికి వెళ్తున్నారు. ప్రభుత్వం కచ్చితంగా ఇదే అమలు చేయాలంటే ఉపాధ్యాయులకు కూడా పీపీఈ కిట్లు ఇవ్వాలని కోరుతున్నాం. .

– సాయిలు, ఉపాధ్యాయుడు, సంగారెడ్డి


Next Story