వరల్డ్స్ లార్జెస్ట్ 3D ప్రింటెడ్ బోట్.. మూడు రోజుల్లోనే!

by Harish |
వరల్డ్స్ లార్జెస్ట్ 3D ప్రింటెడ్ బోట్.. మూడు రోజుల్లోనే!
X

దిశ, ఫీచర్స్ : టెక్నాలజీ వరల్డ్‌లో.. ఫ్యూచర్ మొత్తం 3డీ ప్రింటింగ్‌దే అనే మాటలు వినే ఉంటారు. వినడమే కాదు ఇప్పటికే అలాంటి సాంకేతికతతో రూపొందించిన నమూనాలను కూడా చూసుంటారు. కాగా నిర్మాణ రంగంలో విప్లవాత్మక మార్పులు తేగలదని విశ్వసిస్తున్న ఈ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద 3D-ప్రింటెడ్ బోట్‌‌ను రూపొందించారు. మైనే విశ్వవిద్యాలయం మూడు రోజుల కంటే తక్కువ వ్యవధిలో ఈ బోట్‌ను నిర్మించగా.. వరల్ట్స్ లార్జెస్ట్ 3D-ప్రింటెడ్ బోట్‌గా రికార్డు సృష్టించడంతో పాటు మరో రెండు రికార్డులను కూడా నెలకొల్పింది.

ప్రపంచంలోనే అతిపెద్ద 3డీ ప్రింటర్‌తో ఈ బోట్‌ను రూపొందించారు. 3డిరిగో అని పిలువబడే ఈ పడవ పొడవు 7.62 మీటర్లు (25 అడుగులు), బరువు 2,268 కిలోలు (5,000 పౌండ్లు). మెరుగైన పనితీరు గల విండ్ మెషిన్‌తో పాటు మల్టీడైరెక్షనల్ వేవ్ బేసిన్‌‌ను కలిగి ఉండటమే దీని ప్రత్యేకత. మైనే విశ్వవిద్యాలయం 2019లో ఆవిష్కరించిన అతిపెద్ద 3D ప్రింటర్(18.3 మీటర్ల పొడవు, 6.7 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల ఎత్తు) సాయంతో ఈ బోట్‌ 3D డిజైన్‌ను రూపొందించారు. ఈ ప్రింటర్ ఎత్తును 30.5 మీటర్ల వరకు విస్తరించుకునే అవకాశం కూడా ఉంది. గంటకు 68 కిలో గ్రాముల మెటీరియల్‌ను ప్రింట్ చేయగల ప్రింటర్.. ఈ ప్రాసెస్‌ను సులభతరం చేసేందుకు 5-యాక్సిస్ మెషిన్ హెడ్‌ను ఉపయోగిస్తుంది. కాగా ప్రింటర్, బోట్‌ రెండింటిని కూడా మైనే, ఒరోనోలోని యూనివర్సిటీ ఆఫ్ మైనే అడ్వాన్స్‌డ్ స్ట్రక్చర్స్ అండ్ కాంపోజిట్స్ సెంటర్ అభివృద్ధి చేసింది.

3D ప్రింటింగ్‌లో, త్రిమితీయ డిజిటల్ మోడల్ నుంచి భౌతిక వస్తువును సృష్టిస్తారు. దీన్ని ‘సంకలిత తయారీ(అడిటివ్ మానుఫ్యాక్చరింగ్)’ అని కూడా పిలుస్తారు. ఈ ప్రక్రియ కంప్యూటర్-సృష్టించిన డిజైన్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇది తక్కువ వ్యర్థాలను సృష్టించనుండగా.. సాంప్రదాయ నిర్మాణ పద్ధతుల కంటే మరింత కచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed