బెంగళూరులో కరోనా పేషంట్లు మిస్సింగ్

by  |
బెంగళూరులో కరోనా పేషంట్లు మిస్సింగ్
X

బెంగళూరు: కరోనా వైరస్‌లు విపరీతంగా పెరుగుతున్న బెంగళూరులో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో 3,338 మంది కరోనా పేషెంట్ల అదృశ్యమయ్యారని, తప్పుడు చిరునామాలు, ఫోన్ నెంబర్లు ఇచ్చారని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. పోలీసులతో కలిసి వెతికినా 3,338 కరోనా పేషెంట్లను కనుగొనలేకపోయామని తెలిపారు. వారంతా కరోనా టెస్టుకు నమూనాలు ఇచ్చినప్పుడు తప్పుడు ఫోన్ నెంబర్లు, అడ్రస్‌లు నమోదు చేసుకున్నారని, కరోనా పాజిటివ్ రాగానే అందుబాటులో లేకుండా పోయారని బృహత్ బెంగళూరు మహానగర పాలికే కమిషనర్ ఎన్ మంజునాథ్ ప్రసాద్ వివరించారు.

వారంతా క్వారంటైన్‌లో ఉన్నారా? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారనే వివరాలేవీ దొరకడం లేదని, ఆచూకీని కనుగొనడానికి ఎటువంటి ఆధారాలు లేవని అధికారులు చెప్పారు. వారందరి ఆచూకీని కనుగొని క్వారంటైన్ చేయాలని, వారందరిని ఐసొలేట్ చేయడానికి తీర్మానించుకున్నట్టు డిప్యూటీ సీఎం డాక్టర్ అశ్వత్ నారాయణ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే కరోనా టెస్టు కోసం నమూనాలు సేకరించేటప్పుడే వారికి ఐడీకార్డులు ఇచ్చి మొబైల్ నెంబర్లనూ పరీక్షించాలని అధికారులు ప్రభుత్వాన్ని అడగనున్నట్టు అభిప్రాయపడ్డారు. బెంగళూరులో కేవలం 14 రోజుల్లోనే కరోనా కేసులు 16వేల నుంచి 27వేలకు చేరడం గమనార్హం. రాష్ట్రంలోని సగం కేసులు కేవలం రాజధాని నగరంలో ఉన్నాయి. బెంగళూరులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఉదంతం వెలుగులోకి రావడం కలకలం రేపుతున్నది.


Next Story