ఢిల్లీలో 23శాతం మందికి కరోనా!

by  |
ఢిల్లీలో 23శాతం మందికి కరోనా!
X

న్యూఢిల్లీ :
కరోనా వైరస్ చాపకింద నీరులా తన వ్యాపిని పెంచుకంటూ వెళ్తోంది. వైరస్ సోకిన వారికి లక్షణాలు కనిపించకపోవడంతో వారి నుంచీ వైరస్ ఇతరులకు సోకుతున్నది.ఈ నేపథ్యంలోనే దేశ రాజధాని ఢిల్లో 23 శాతం మంది గతంలో ఎప్పుడో ఒకసారి కరోనాకు ఎక్స్‌పోజ్ అయ్యారని తేలింది. ఇందులో చాలా మంది లక్షణాలు లేనివారే ఉండటం గమనార్హం. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్‌సీడీసీ) నిర్వహించిన సెరోలాజికల్ సర్వేలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సర్వే చేసిన 23.48శాతం మందిలో ఇమ్యునోగ్లోబులిన్ జీ యాంటీబాడీలు అభివృద్ధి చెంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంటే గతంలోనే వారు కరోనా వైరస్‌కు ఎక్స్‌పోజ్ అయి ఉండొచ్చని, తద్వారా ఈ యాంటీబాడీలు దేహంలో వృద్ధి చెంది ఉంటాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇందులో చాలా మందిలో లక్షణాలు బయటపడలేదు. అత్యధిక జనసాంద్రత ప్రాంతాలు ఎక్కువున్న ఢిల్లీలో కరోనా ప్రవేశించి ఆరు నెలలు గడుస్తున్న సందర్భంలో 23శాతం మంది మాత్రమే వైరస్‌ బారిన పడ్డారు.లాక్‌డౌన్, సామాజిక దూరం, మాస్కులు లాంటి కఠిన నిబంధనలతోనే ఇది సాధ్యమైందని ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో అభిప్రాయపడింది. అయితే, ఇంకా పెద్దమొత్తంలో ప్రజలు కరోనా బారినపడే ప్రమాదమున్న నేపథ్యంలో కదలికలపై ఆంక్షలు కొనసాగించాల్సిన అవసరమున్నదని కేంద్రం సూచించింది.

సర్వే ఇలా..

సీరో సర్వేను జూన్ 27 నుంచి జులై 10 వరకు నిర్వహించారు. కరోనావ్యాప్తిని తక్కువ కాలంలో అంచనా వేయడానికి ఇటువంటి సర్వేను నిర్వహిస్తుంటారు. ఇందుకు ఢిల్లీలోని మొత్తం 11 జిల్లాల నుంచి ర్యాండమ్‌గా 21,387 మంది నుంచి రక్త నమూనాలను ముందస్తు అనుమతితో సేకరించారు. ఐసీఎంఆర్ ఆమోదించిన కొవిడ్ కవచ్ ఎలీసా ద్వారా ఈ నమూనాలను యాంటీబాడీల కోసం పరీక్షలు జరిపారు. ఇందులో 23.48 శాతం మంది నమూనాల్లో యాంటీబాడీలు డెవలప్ అయినట్టు తేలింది. ఎన్‌సీడీసీ ఢిల్లీ ప్రభుత్వంతో కలిసి ఈ సర్వేను నిర్వహించింది.

కేఫ్‌లో పార్టీ.. 41 మంది అరెస్టు

ఢిల్లీలోని పశ్చిమ విహార్ ఏరియాలోని ఓ కేఫ్‌లో సామాజిక దూరాన్ని పక్కనపెట్టి పార్టీ చేసుకుంటున్న 41 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి ఈ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తుండగా ఓ కేఫ్ నుంచి పెద్దఎత్తున చప్పుళ్లు రావడంతో పోలీసులు వెళ్లి చూశారు. 25 మంది మహిళలు సహా 40 మంది మద్యం సేవిస్తూ పార్టీలో మునిగిపోయినట్లు గుర్తించారు. కేఫ్ ఓనర్ వారికి సర్వ్ చేస్తున్నారు. భౌతిక దూరాన్ని పక్కనపెట్టి పార్టీ చేసుకుంటున్న 40 మందిని, కేఫ్ ఓనర్‌ను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.


Next Story

Most Viewed