చేయని తప్పుకు 20 ఏళ్ల జైలు శిక్ష

by Anukaran |   ( Updated:2020-11-21 06:38:06.0  )
చేయని తప్పుకు 20 ఏళ్ల జైలు శిక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: కోర్టులో నిజానిజాలను పరిశీలించి దోషికి శిక్ష వేస్తారు. అది అమెరికా అయినా, ఇండియా అయినా లేక మరే ఇతర దేశమైనా సరే న్యాయ వ్యవస్థ ఇలాగే ఉంటుంది. తీర్పు చెప్పడంలో ఒక్క ఆధారం అటూ ఇటూ అయినా జీవితాలే మారిపోతాయి. దోషి తప్పించుకున్నా పర్లేదు కానీ, నిర్దోషికి శిక్ష పడొద్దనేది ధర్మం.

కానీ, అమెరికాలోని క్లీవ్‌లాండ్‌కు చెందిన జో డి యాంబ్రోసియో మాత్రం తాను చేయని హత్యకు ఏకంగా 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. 1988లో టోనీ క్లాన్ అనే 19 ఏళ్ల కుర్రాడిని హత్య చేసి, క్లీవ్‌ల్యాండ్ కాలువలో పడేశారన్న కారణంగా ఓహాయో కోర్టు.. జో డి యాంబ్రోసియోకు కఠిన కారాగార శిక్ష విధించింది.

టోనీ గొంతు కోసి, కాలువలో పడేయడం తాను చూసినట్లు ఎస్పినోజా అనే వ్యక్తి చెప్పిన సాక్ష్యం ఆధారంగా జో డి యాంబ్రోసియోకు కోర్టు శిక్ష విధించింది. ఓహాయో చరిత్రలోనే అతి తక్కువ రోజులు విచారణ జరిగిన కేసుగా ఇది అప్పట్లో రికార్డు సృష్టించింది. అయితే జైల్లో అనుకోకుండా కలిసిన ఫాదర్ నీల్ కూకూతే ఈ కేసు గురించి తెలుసుకుని, యాంబ్రోసియోకు సాయం చేయాలనుకున్నాడు. కేవలం రెండ్రోజుల్లో విచారణ పూర్తి చేయడం ఏంటని, తానే స్వయంగా లోతుగా విచారించడం మొదలుపెట్టాడు.

ఆ విచారణలో ఒక నిజం తెలిసింది. విచారణ కోసం ఉపయోగించిన మెటీరియల్‌లో ఫాదర్ నీల్‌కు ఒక క్లూ దొరికింది. గొంతు కోసిన తర్వాత టోనీ ఇంటి నుంచి బయటికి వస్తూ గట్టిగా సాయం కోసం అరిచాడని ఎస్పినోజా చెప్పినట్లు అందులో ఉంది. అయితే గొంతు కోసిన తర్వాత వ్యక్తి కనీసం మాట్లాడలేడు, అలాంటిది టోనీ అరవడం ఎలా సాధ్యమవుతుందని ఫాదర్ నీల్ కౌంటర్ కేసు వేశారు. చివరికి తన న్యాయవాది తెలివితేటలు ఉపయోగించి జో డి యాంబ్రోసియోను బయటికి తీసుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed