తెలంగాణలో 2 కోట్ల టీకాలు పంపిణీ

by Shyam |   ( Updated:2021-09-15 07:48:53.0  )
తెలంగాణలో 2 కోట్ల టీకాలు పంపిణీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారిలో 2 కోట్ల 80 లక్షల మంది టీకాకు అర్హులుండగా, ఇప్పటి వరకు 2,00,60,699 మంది వ్యాక్సిన్ వేసుకున్నారు. వీరిలో 1,45,22,206 మంది మొదటి, 55,38,493 మంది రెండో డోసునూ పొందారు. అంటే రెండు డోసులు పొందిన వారు కేవలం 51 శాతం మంది ఉండగా.. కనీసం ఒక్క డోసు కూడా తీసుకోని వారు 49 శాతం మంది ఉన్నారు. అయితే ఈ నెలాఖరు వరకు వీరందరికీ ఒక్క డోసును అయినా పూర్తి చేయాలని ఆరోగ్యశాఖ లక్ష్యం పెట్టుకున్నది. ఈ మేరకు ప్రతీ గ్రామంలో మొబైల్ వ్యాక్సినేషన్ నిర్వహించబోతున్నారు. ఒకటిరెండ్రోజుల్లో ఈ కార్యక్రమం షురూ కానుంది. ప్రతీ రోజు సగటున 3 లక్షల మందికి డోసులు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. బుధవారం కొత్తగా మరో 2,31,795 మందికి డోసులు తీసుకోన్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొన్నది.

బీఆర్ కే భవన్ లో సెలబ్రేషన్స్

రాష్ట్రంలో రెండు కోట్ల వ్యాక్సిన్లు పంపిణీ సందర్భంగా బీఆర్ కే భవన్ లో సెలబ్రేషన్స్ జరిగాయి. హెల్త్ డైరెక్టర్ డా జీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేష్ కుమార్ కేక్ కట్ చేశారు. అనంతరం సీఎస్ మాట్లాడుతూ..ఇప్పటి వరకు టీకా పొందని వారు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అప్పుడే వైరస్ ముప్పు బారి నుంచి రక్షించుకోవచ్చన్నారు. గతంలో డోసుల కొరతతో కోటి డోసుల పంపిణీకి 165 రోజుల సమయం పట్టగా, రెండు కోట్లు చేరుకోవడానికి కేవలం 78 రోజుల సమయంలోనే పూర్తి చేశామన్నారు. గ్రామాల్లో ఉండే ఆశావర్కర్ల నుంచి హెచ్ ఓడీల స్థాయి వరకు వైద్యారోగ్యశాఖ అద్భుతంగా పనిచేసిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ జీ శ్రీనివాసరావు, సీఎం ఆరోగ్యవిభాగం సలహదారుడు డా గంగాధర్, టీఎస్ఎంఎస్ ఐడీసీ ఎండీచంద్రశేఖర్ రెడ్డి, హైదరాబాద్ డీఎమ్ హెచ్ఓ డాక్టర్ వెంకట్, రంగారెడ్డి డీఎమ్ హెచ్ ఓ డా స్వరాజ్య లక్మ్మీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed