లక్కీ డ్రా పేరిట భారీ మోసం.. ఏకంగా 2 కోట్లకు టోకరా

by Sumithra |
లక్కీ డ్రా పేరిట భారీ మోసం.. ఏకంగా 2 కోట్లకు టోకరా
X

దిశ, నిజామాబాద్ రూరల్: రూరల్ నియోజకవర్గం ఇందల్వాయి మండల కేంద్రంలో నిషేధిత లక్కీ డ్రా లు అధికారుల కనుసన్నల్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్కీ డ్రా పేరిట దాదాపు 2 వేల మంది నుండి సుమారు రెండు కోట్ల రూపాయలు వసూలు చేసి ముప్పతిప్పలు పెడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇందల్వాయి మండల కేంద్రంలో త్రీ మూర్తి, శ్రీ సాయి అనే లక్కీ డ్రా స్త్రీ కంపెనీలు గత సంవత్సరం నుండి ఇందల్వాయి మండల కేంద్రంగా అడ్డా చేసుకొని చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని వ్యాపారవేత్తలు, దుకాణ యజమానులు, ప్రైవేటు ఉద్యోగస్తుల నుండి ప్రతి నెలా 1200-3000 రూపాయల వరకు వసూలు చేసి లక్కీ డ్రాలో పేరు నమోదు చేసుకున్న బాధితులకు మొండి చేయి చూపించి సదరు లక్కీ డ్రా నిర్వాహకులు 2 కోట్ల రూపాయలను స్వాహా చేశారు.

గతంలో ఇందల్వాయి ఎస్ఐగా పనిచేసిన శివప్రసాద్రెడ్డి నెలవారీ ముడుపులు లక్కీ డ్రా నిర్వాహకుల నుండి తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. లక్కీ డ్రా నిర్వాహకులు దాదాపు రెండు వేల మందిని జమ చేసి వారి నుండి నెలనెలా వెయ్యి రూపాయలు ఏడాదిగా వసూలు చేసి చివరికి చేతులెత్తేసి లక్కీ డ్రాలో చేరిన సభ్యులను ముంచుతారు. ఫ్రైజ్ చిట్స్, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ పై రాష్ట్రంలో పూర్తిగా నిషేధం అమల్లో ఉంది. ఇందుకోసం గతంలో ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ప్రాథమిక సమాచారం మేరకు దాడి జరిపి కేసులు నమోదు చేసే అధికారం పోలీసులకు ఉంది. లక్కీ డ్రా నిర్వహించే వారికి ఎలాంటి అనుమతులు ఇవ్వరు కానీ.. పలువురు లక్కీ డ్రా కంపెనీలు ఏర్పాటు చేసి వేలాది మందిని సభ్యులుగా చేర్చుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇందల్వాయిలో రెండు లక్కీ డ్రా కంపెనీలు వేలసి సుమారుగా రెండు వేల మందిని మోసగించినట్టు ఆరోపణలు ఉన్నాయి.

కేవలం ఇందల్వాయి మండలం కాకుండా రూరల్ నియోజకవర్గంలోని దరిపెల్లి, రూరల్, మోపాల్ మండలాల్లో, అదేవిధంగా జిల్లాలో అనేక చోట్ల లక్కీ డ్రా కంపెనీలు ఇప్పటికీ నడుస్తున్నాయని వాటి ద్వారా ప్రజలు ఎంతగానో మోసపోతున్నారని తెలుస్తుంది. కానీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటూ లక్కీ డ్రా నిర్వాహకులపై చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా ఆపత్కర పరిస్థితుల్లో రూపాయి.. రూపాయి.. కూడబెట్టి లక్కీ డ్రా వారికి కడితే.. వారు సైతం చేతులెత్తేసి లక్కీ డ్రాలో చేరిన సభ్యులను నట్టేట ముంచుతున్నారు. మొదటి ఆరు నెలలు లక్కీ డ్రా లో చేరిన వారికి నెల,నెలా నగదు కట్టించుకొని టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు, గృహోపకరణాలు, వాహనాలు, బంగారు బహుమతులుగా ఇచ్చారు. ఆ తర్వాత కరోనా సాకుతో డ్రా నిర్వహించడం ఆపేశారు. లక్కీ డ్రాలో చేరిన సభ్యుల నుండి నగదును కట్టించుకోవడం మాత్రం ఆపలేదు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా మని తెలపడంతో వారు కట్టిన నగదును తిరిగి ఇచ్చేస్తున్నారు.

Advertisement

Next Story