ఆ ప్రాజెక్టుకు 9ఏళ్లు.. కోనరావుపేట సస్యశ్యామలం అయ్యేనా..?

by Shyam |   ( Updated:2021-04-09 22:06:22.0  )
ఆ ప్రాజెక్టుకు 9ఏళ్లు.. కోనరావుపేట సస్యశ్యామలం అయ్యేనా..?
X

పుష్కరకాలమైనా ఆ ప్రాజెక్టు పూర్తికాలేదు. నత్తను తలపిస్తున్న ప్రాజెక్టు పనులను చూసి ఆయకట్టు రైతులు ఆందోళ చెందుతున్నారు.ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకం ద్వారా మెట్ట ప్రాంతమైనా కోనరావుపేట మండలాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రారంభించిన రిజర్వాయర్ పనులు నేటికీ పూర్తి కాలేదు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం భూములిచ్చిన కొందరు నిర్వాసితులకు నేటికీ పరిహారం అందలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటలో ప్రాజెక్టు నిర్మాణానికి 2008లో ప్రతిపాదనాలు రూపొందించి 2012లో 9వ ప్యాకేజీ కింద పనులు ప్రారంభించారు. కాంట్రాక్టర్​ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో పనులు ముందుకు సాగడం లేదు. ఆ తర్వాత ప్రారంభించిన 10,11,12 ప్యాకేజీ పనులు చివరి దశకు చేరుకున్నా 9వ ప్యాకేజీ కింద చేపట్టిన మల్కపేట రిజర్వాయర్​ పనులకు గ్రహణం వీడడం లేదు..

దిశ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటలో రిజర్వాయర్ పనులకు 2008లో రూ.550 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు రూపొందించారు. మల్కపేట, నిజామాబాద్, ధర్మారం గ్రామాల్లో భూ సేకరణ అనంతరం 2012లో రిజర్వాయర్ పనులు 9వ ప్యాకేజి కింద ప్రారంభించారు. కాలక్రమేణా రిజర్వాయర్ పనులకు నిధులు సరిపోడం లేదని, ప్రాజెక్ట్ అంచనాలు రూ.1,468 కోట్లకు చేరడంతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా పనులు చేస్తున్నారు. ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 3 టీఎంసీలు ఉండగా, ఎత్తిపోతల ద్వారా కొదురుపాక మిడ్​మానేరు నుంచి మల్కపేట రిజర్వాయర్ మీదుగా మైసమ్మ చెరువు, గంభీరావుపేట మండలంలోని సింగసముద్రం నుంచి సెకండ్ స్టేజ్ పంప్​హౌస్, బత్తుల చెరువు మీదుగా అప్పర్ మానేరు (నర్మాల ప్రాజెక్ట్)లోకి నీళ్లు నింపేలా 32.4 కి.మీ పనులు చేపట్టారు. ఇందులో సొరంగ మార్గం 11.9 కి.మీ ఉండగా, ఇంకా25 మీటర్ల పనులు పెండింగ్​లో ఉన్నాయి. రిజర్వాయర్ కట్ట, పనులు 3 లక్షల క్యూబింగ్ మీటర్ల చేయాల్సి ఉండగా, కెనాల్​ పనులు 10 కి.మీ మిగిలి ఉన్నాయి.

9వ ప్యాకేజీకి వీడని గ్రహణం..

9వ ప్యాకేజీ పనుల ద్వారా మల్కపేటలో చేపట్టిన రిజర్వాయర్ పనులు నత్తనడకన సాగుతుండగా, ఆ తర్వాత ప్రారంభించిన 10,11,12 ప్యాకేజీ పనులు చివది దశకు చేరుకున్నాయి. 9వ ప్యాకేజీ పనులు మాత్రం ఇంకా కొనసాగతూనే ఉన్నాయి. మల్కపేట ప్రాజెక్ట్ పనుల్లో వేగవంతం పెంచాలని, ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ రివ్యూ మీటింగ్​పెట్టి సూచనలు చేస్తున్నప్పటికి ఆఫీసర్లు, కాంట్రాక్టర్లు పెడచెవిన పెడుతున్నారు. రెండు నెలల క్రితం సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్ మల్కపేట రిజర్వాయర్ పనులను పరిశీలించారు. వచ్చే ఖరీప్ వరకు రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జూన్ మాసం వరకు పనులు పూర్తి అయ్యే అవకాశాలు కనిపించడం లేదని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పనులు పూర్తి చేసి తమ పొలాలకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed