ప్ర‌ణ‌య్‌ కేసు చార్జిషీటులో సంచలన విషయాలు?

by Sumithra |   ( Updated:2020-03-10 04:17:45.0  )
ప్ర‌ణ‌య్‌ కేసు చార్జిషీటులో సంచలన విషయాలు?
X

దిశ, న‌ల్ల‌గొండ‌: హ‌త్య‌కు గురైన పెరుమాళ్ల‌ ప్రణయ్ కేసులో మిర్యాల‌గూడ పోలీసులు మంగళవారం న‌ల్ల‌గొండ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. 102 మంది సాక్షులను విచారించి 1,200 పేజీలతో కూడిన‌ చార్జిషీట్‌ను కోర్టుకు నివేదించారు. ఈ కేసులో ఎ-1 నిందితుడిగా ఉన్న మారుతీరావు శనివారం రాత్రి ఆత్మ‌హ‌త్య చేసుకున్న విషయం తెలిసిందే. పోస్టుమార్టం రిపోర్టును కూడా పోలీసులు కోర్టుకు స‌మ‌ర్పించారు. 1,200 పేజీల‌తో కూడిన చార్జిషీట్‌ను చదవడానికి స‌మ‌యం పడుతుందని, అందుకు తనకు గ‌డువు కావాల‌ని నిందితులు తరఫు లాయ‌ర్ కోర‌డంతో న్యాయ‌మూర్తి అందుకు అంగీక‌రించారు. కాగా, కోర్టుకు మారుతీరావు తమ్ముడు శ్రవణ్ హాజరుకాలేదు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగతా ఆరుగురిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. నిందితులు ఈ కేసు నుంచి ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకుండా బలమైన, శాస్త్రీయ ఆధారాలను పోలీసులు చార్జిషీట్‌లో పొందుపరిచినట్టు సమాచారం.

రెండేళ్ల కిందట హత్య..

సరిగ్గా రెండేళ్ల కిందట మారుతీ‌రావు కూతురు అమృత మిర్యాలగూడ‌కు చెందిన దళితుడు ప్రణయ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. 2018 సెప్టెంబర్ 14వ తేదీన మిర్యాలగూడ జ్యోతి ఆస్పత్రి వద్ద హత్యకు గురయ్యాడు. అయితే, దీంతో మారుతీరావు సుపారి టీమ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించాడని అమృత, ప్రణయ్ కుటుంబీకులు ఆరోపించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ హత్య కేసులో మారుతీరావు‌తోపాటు కిరాయి హంతకులపై పోలీసులు కేసు నమోదు చేసి పీడీ యాక్ట్ పెట్టారు. దాదాపు 10 నెలలు క్షణ్ణంగా విచారించిన తర్వత పోలసులు చార్జీషీట్ రూపొందించారు.

చార్జీషీట్‌లో సంచ‌ల‌న విష‌యాలు?

దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన‌ ప్ర‌ణ‌య్ హ‌త్య కేసులో ఎ-1 నిందితుడిగా మారుతీరావు, ఎ-6 నిందితుడిగా మారుతీరావు సోద‌రుడు శ్ర‌వ‌ణ్‌ పేర్ల‌ను చేర్చారు. కోర్టుకు స‌మ‌ర్పించిన 1200 పేజీల చార్జీ‌షీట్‌లో సంచలన విషయాలున్నాయంటున్నారు. ముందుభాగంలోని 4 పేజీల్లో బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదును పొందుప‌రిచారు. ప్ర‌ణ‌య్ తండ్రి బాల‌స్వామితో పాటు ప్ర‌ణ‌య్ భార్య అమృత ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను చేర్చారు. ఈ కేసులో సుమారు 102 మందిని సాక్షుల‌ను విచారించి వారి వాంగ్మూలాల‌ను రికార్డు చేశారు. హ‌త్య‌కు ముందు హ‌త్య తర్వాత చోటుచేసుకున్న ప‌రిణామాల గురించి స‌వివ‌రంగా వివ‌రించారు. 6వ పేజీ నుంచి 14వ పేజీ వ‌ర‌కు సాక్షులు చెప్పిన అంశాల‌ను, 16వ పేజీలో ప్ర‌ణయ్ హ‌త్య ఎలా జ‌రింగింద‌నే విషయాన్ని ప్ర‌స్తావించారు. హంత‌కుల దాడిలో ప్ర‌ణ‌య్ గొంతు, త‌ల‌కు తీవ్ర‌గాయాలు కావ‌డంతో ఆయ‌న మృతి చెందినట్టు పేర్కొన్నారని సమాచారం. 41వ పేజీ నుంచి 44వ పేజీల్లో నిందితుల పేర్ల‌ను పొందుప‌రిచారు. ఎ-2‌గా ప్ర‌ణ‌య్‌ను హ‌త్య చేసిన నిందితుడు సుభాష్‌శ‌ర్మ‌, ఎ-3గా అస్ఘ‌ర్ అలీ, ఎ-4గా మ‌హ్మ‌ద్ భారీ, ఎ-5 నిందితుడిగా కాంగ్రెస్ నేత‌ క‌రీం, ఏ-7గా మారుతీ రావు డ్రైవ‌ర్ శివ‌, ఏ-8గా ఎంఎ నిజాం పేర్ల‌ను పొందుపర్చారు. నిందితుల పేర్ల‌ను పొందుప‌ర్చిన తర్వాత ప్ర‌ణ‌య్ తండ్రి బాల‌స్వామి ఫిర్యాదు కాపీని చార్జిషీట్‌కు జ‌త‌ప‌రిచారు. అమృత ప్ర‌ణ‌య్ ప‌రిచ‌యం, ప్రేమ‌, పెండ్లితోపాటు హ‌త్య‌కు దారితీసిన ప‌రిస్థితుల‌ను వివరించారు. ప్ర‌ణ‌య్ 2018లో హైద‌రాబాద్ ఆర్య‌స‌మాజ్ మందిరంలో అమృతను పెళ్లి చేసుకున్నాడనీ, ఆ తర్వాత అమృత‌ను త‌న ఇంటికి తీసుకొచ్చుకోవాల‌ని మారుతీరావు రాయబారం న‌డిపించ‌గా అందుకు ఆమె అంగీక‌రించ‌లేద‌ని పేర్కొన్నారు. కులం త‌క్కువవాడిని పెళ్లి చేసుకుని ప‌రువు తీసింద‌ని మథనపడ్డ మారుతీరావు, ప్ర‌ణ‌య్‌ను హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్టు, సుపారీకి అవ‌స‌ర‌మైన డ‌బ్బుల‌ను స‌మ‌కూర్చాల‌ని త‌మ్ముడు శ్ర‌వ‌ణ్‌కుమార్‌కు తెలిపిన‌ట్టుగా చార్జిషీట్‌లో రాశారు.

మృత‌దేహం ఎవరిదో..

ఇటీవల మారుతీరావు షెడ్డులో ఒక మృతదేహం లభించింది. అది ఎవరిదీ, ప్రణయ్ హత్యతో ఏమైనా సంబంధం ఉందా? అనే అంశాలపై పోలీసులు స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. ప్రణయ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మారుతీరావు శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, మారుతీరావు హత్య చేసుకోవడానికి కారణం.. పోలీసులు వేధించడమేనని అతని భార్య గిరిజ ఆరోపించారు. సోదరుడు శ్రవణ్ వేధింపుల వల్లే సూసైడ్ చేసుకున్నారనే ఆరోపణలూ వచ్చాయి. ఈ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు లభించలేదు. కానీ, కేసు విచారణ సందర్భంగా నిజనిజాలు వెలుగుచూసే అవకాశం మాత్రం ఉంది. ఎ1 నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడంతో మిగతా నిందితులపై మోపిన నేరాభియోగాలను పోలీసులు విచారణలో రుజువు చేయాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed