పులిని దత్తత తీసుకున్న 12 ఏళ్ల చిన్నోడు

by  |
పులిని దత్తత తీసుకున్న 12 ఏళ్ల చిన్నోడు
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ సంక్షోభం కేవలం మనుషులకే పరిమితం కాలేదు. మూగజీవాలపైనా ఆ ప్రభావం పడింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌ను మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో జూ ఆదాయం కోల్పోవడంతో నిధుల లేమి కారణంగా జంతువులకు సరైన వసతులు అందించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది దాతలు ‘జూ’లోని జంతువులను దత్తత తీసుకునేందుకు ముందుకొస్తున్నారు. లాక్‌డౌన్ టైమ్‌లో.. ఆరిజెన్ ఫార్మాస్యూటికల్ సర్వీసెస్ లిమిటెడ్ సీఈవో రవి వెంకటరమణన్ జూపార్కులోని రాయల్ బెంగాల్ టైగర్‌ను ఏడాది పాటు దత్తత తీసుకున్నారు. ‘ప్రభాస్‌’గా పిలిచే.. ఆ పులి ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయల చెక్కును జూ అధికారులకు అందించారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన 12 ఏళ్ల విద్యార్థి.. మరో పులిని దత్తత తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

పిల్లలకు తమ పుట్టిన రోజంటే.. చాలా స్పెషల్ డే. ఆ రోజు తమకు నచ్చినవన్నీ కొనుక్కోవాలని ఆశ పడుతుంటారు. అంతేకాదు, తమ స్నేహితులందరినీ పిలిచి పార్టీ ఇవ్వాలనుకుంటారు. అయితే, అందుకు భిన్నంగా ఏడో తరగతి చదువుతున్న చిన్మయ్ సిద్దార్థ్ షా.. తన బర్త్ డే సందర్భంగా జూ పార్కులోని మూడు నెలల పులిని దత్తత తీసుకున్నాడు. ‘సంకల్ప్’ అని పిలిచే రాయల్ బెంగాల్ టైగ‌ర్‌‌కు మూడు నెలల పాటు అయ్యే ఖర్చును తానే భరించనున్నాడు. అందుకుగాను తన తండ్రి సిద్దార్థ్ కంతిలాల్ షా‌తో కలిసి జూ అధికారులకు 25 వేల రూపాయల చెక్కును అందజేశాడు. మ‌రో ఐదుగురు విద్యార్థులు కూడా ఇత‌ర జంతువులు, చిన్న పక్షులను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చి ఒక్కొక్క‌రూ రూ.5 వేల చెక్కును అంద‌జేశారు.

కాగా, జంతువుల‌పై చిన్నారులు చూపించిన అమితమైన ప్రేమకు జూ అధికారి నాగమణి కృతజ్ఞతలు తెలిపారు. వీరిని ఆద‌ర్శంగా తీసుకొని ఎక్కువ మంది ముందుకొచ్చి జంతువులను దత్తత తీసుకోవాలని ఆమె కోరారు. సెలబ్రిటీలు, బిజినెస్‌మ్యాన్‌లు, ఇతరులు ముందుకు రావాలని ఆమె అన్నారు. గతంలో.. చెన్నైలోని వాండళూరు ప్రాంతంలో ఉన్న అరిగ్నర్ అన్నా జంతుప్రదర్శన శాలలోని రెండు పులి పిల్లలను తమిళ నటుడు విజయ్ సేతుపతి దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ 1650 ఎకరాల ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌ ల్యాండ్‌ను దత్తత తీసుకుని అందరికీ స్పూర్తిగా నిలిచాడు. ఎకో పార్క్ అభివృద్ధి చేయడానికి గాను రూ. 2 కోట్లు అక్కడి అధికారులను అందజేశాడు.

కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి రూపాయి కూడా కౌంట్ అవుతోంది. బిందువు బిందువే సింధువు అయినట్లు.. ప్రతి చిన్న సాయం కూడా ఓ జంతువు ఆకలి తీరుస్తోంది. 12 ఏళ్ల చిన్మయ్.. ఈ విషయంలో అందరికీ స్ఫూర్తినిస్తున్నాడు.

Read Also…

స్క్రాప్‌తో బైక్ రూపొందించిన టెన్త్ క్లాస్ కుర్రాడు



Next Story