మహాభారతాన్ని ట్రాన్స్‌లేట్ చేసిన 12 ఏళ్ల బాలుడు

by Shyam |
మహాభారతాన్ని ట్రాన్స్‌లేట్ చేసిన 12 ఏళ్ల బాలుడు
X

దిశ, వెబ్‌డెస్క్: ఒక భాషలో ఉన్న పుస్తకాన్ని మరో భాషలోకి ట్రాన్స్‌లేట్ చేయడానికి పేరుమోసిన రచయితలే కాస్త జంకుతారు. అలాంటిది మహా గ్రంథం.. ‘మహాభారతం’ను ట్రాన్స్‌లేట్ చేయాలంటే? అది పండితోత్తములకే సాధ్యం. కానీ, ఏడో తరగతి చదువుతున్న ఓ బాలుడు.. ‘మహా భారతాన్ని’ ఒడియా భాషలోకి అనువాదం చేసి ఔరా అనిపించాడు.

జైపూర్, కర్మాంగి ఊరికి చెందిన ఉదయ కుమార్ సాహోకు లాక్‌డౌన్ వల్ల వచ్చిన సెలవుల్లో చాలా బోరింగ్‌గా అనిపించేది. ఎంతసేపు ఆడుకున్నా.. తన చేతిలో మరెంతో ఫ్రీ టైమ్ ఉండేది. ఈ క్రమంలోనే ఖాళీ సమయాల్లో ఇంటర్నెట్‌లో హిందీ భాషలో ఉన్న మహాభారతాన్ని చూశాడు. అప్పుడే దాన్ని ఒడియా భాషలోకి ట్రాన్స్‌లేట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అనువాదమే కదా.. ఎవరైనా చేస్తారనుకుంటే పొరపాటే. ట్రాన్స్‌లేట్ చేసే విషయంలో.. పుస్తకంలోని సారం ఏమాత్రం తప్పుదోవ పట్టకూడదు, భావం చెడిపోకూడదు. అందులోనూ హిందువులకు అతి పవిత్రమైన, ఇతిహాస గ్రంథం కావడంతో అనువాదం విషయంలో మరింత శ్రద్ధ అవసరం. అందుకే ఉదయ్ మహాభారతాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, అందులోని సారం అందరికీ అర్థమయ్యేలా, ఏమాత్రం తప్పుల్లేకుండా ఒడిశా ప్రజలకు అందించాడు.

‘ఇటీవలే నా వయసు పిల్లోడే.. మహాభారతాన్ని ట్రాన్స్‌లేట్ చేసిన విషయాన్ని ఇంటర్నెట్‌లో చదివాను. అది నా మైండ్‌లో అలా ఉండిపోయింది. లాక్‌డౌన్ కారణంగా సెలవులు రావడంతో ఫ్రీ టైమ్‌లో అనువాదం చేయాలనే ఆలోచన వచ్చింది. ఇందుకు అమ్మనాన్నలు నాకు ఎంతగానో సాయం చేశారు. ప్రతిరోజు మూడు నాలుగు గంటలు ట్రాన్స్‌లేషన్‌కు కేటాయించాను. మొత్తంగా 250 పేజీల్లో మహాభారతాన్ని కంప్లీట్ చేశాను’ అని ఉదయ్ అంటున్నాడు.

ఉదయ్ జైపూర్‌లోని శ్రీ అరబిందో నోడల్ స్కూల్‌‌లో ఏడో తరగతి చదువుతున్నాడు. తమ స్కూలు ఉపాధ్యాయులు, ఊరి ప్రజలు ఉదయ్ చేసిన పనికి ఎంతగానో ప్రశంసిస్తున్నారు. తమ ఊరికి ఎంతో పేరు తీసుకొచ్చాడని చెబుతున్నారు.

Advertisement

Next Story