సెంచరీ తాత.. స్కూబా డైవింగ్‌తో గిన్నిస్ రికార్డ్

దిశ, వెబ్‌డెస్క్ : వృద్ధాప్యంలో ‘కృష్ణా.. రామా’ అంటూ కూర్చునే రోజులు ఎప్పుడో పోయాయి. వయసు శరీరానికే కానీ, మనసుకు కాదంటూ ఎంతోమంది పండుటాకులు నిరూపిస్తున్నారు. ఇటీవలే మన ‘దిశ’లో వందేళ్ల వయసులోనూ డిజిటల్ పాఠాలు నేర్చుకుంటున్న బామ్మల గురించి తెలుసుకున్నాం. అంతకుముందు వందేళ్ల తాత వంద రౌండ్లు నడిచి, కోటానుకోట్ల విరాళాలు సేకరించిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడు మరో సెంచరీ తాత.. ‘స్కూబా’ డైవింగ్ చేసి గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించాడు.

సాహసాలు చాలా మంది చేస్తారు. కానీ, లేటు వయసులో.. అసలు ఇంతవరకు ఎవరూ చేయని సాహసం చేయాలని నిశ్చయించుకోవడమే ఓ సాహసం. అమెరికా, ఇల్‌నాయిస్‌కు చెందిన బిల్ లాంబర్ట్.. ఇటీవలే గురుపూజోత్సవం రోజు(సెప్టెంబర్ 5)న వందేళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా తన మనసులోని కోరికను నెరవేర్చుకునేందుకు సిద్ధమయ్యాడు. అందుకోసం సౌత్ బెలోయిట్‌లోని పిరల్ లేక్‌లో స్కూబా డైవింగ్ చేశారు. ఈ వయసులో నడిస్తేనే చాలా మంది ఆయాస పడిపోతారు. అలాంటిది సముద్రంలో ఈతకొట్టడం.. అది కూడా నీటి అడుగున.. వావ్! నిజంగా ఈ తాత ఫీట్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

లాంబర్ట్ చేస్తున్న ఈ సాహసాన్ని చూసేందుకు.. ఆయన బంధువులు, స్నేహితులు కూడా అక్కడికి వచ్చారు. అయితే, గత రికార్డు.. బ్రిటిష్ స్కూబా డ్రైవర్ వల్లాస్ రేమండ్ ఊలీ పేరు మీద ఉంది. ఈయన 96 సంవత్సరాల మూడు రోజుల వయసులో ఈ ఫీట్ చేశాడు. కాగా లాంబర్ట్ కూడా 98 ఏళ్ల వయసులో ఓ సారి స్కూబా డైవ్ చేశాడు. కానీ, అప్పుడు గిన్నిస్ రికగ్నిషన్‌కు సబ్‌మిట్ చేయలేదు. ఈ సారి మాత్రం ఆ చాన్స్ మిస్ అవ్వలేదు. గిన్నిస్ రికార్డుల్లో క్వాలిఫై కావాలంటే బిల్ నీటి అడుగున కనీసం 20 నిమిషాలు ఉండాలి. అయితే, బిల్ అంత‌కంటే ఎక్కువ టైమ్.. 27 నిమిషాల పాటు డైవింగ్ చేసి సరికొత్త రికార్డును తన సొంతం చేసుకున్నారు. ‘ఈ సాహసాన్ని చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నీటి అడుగున ఎక్కువ సేపు ఉండటానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరం. అందుకు తగినంత ఆక్సిజన్ వెంట తీసుకెళ్లినా సరే, అలసటగా అనిపించింది. మళ్లీ 101 సంవత్సరంలోకి అడుగుపెట్టాక నా రికార్డును నేనే బ్రేక్ చేయాలని అనుకుంటున్నా’ అని లాంబర్ట్ తెలిపారు.

Advertisement