సీసంతో ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరికి అనారోగ్యం

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలోని ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు సీసం వల్ల వచ్చే విషంతో అనేక అనారోగ్యాలకు గురవుతున్నారని యునిసెఫ్, ప్యూర్ ఎర్త్ సంయుక్తంగా వెలువరించిన నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సీసం వల్ల వెలువడే విషం బారిన 80 కోట్ల మంది పిల్లలు పడుతుండగా, వీరిలో అత్యధిక శాతం పిల్లలు.. పేద, మధ్య స్థాయి ఆదాయం ఉన్న దేశాల్లోనే నివసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సీసం బారిన పడుతున్న పిల్లల్లో భారత్‌లోనే 27.5 కోట్ల మంది ఉన్నట్లు వెల్లడైంది.

లోహ పదార్థమైన సీసాన్ని ముఖ్యంగా చిన్నపిల్లల ఆటబొమ్మల్లో వినియోగిస్తుంటారు. ఆ బొమ్మలకు ఉపయోగించే రంగుల్లో సీసం కలుస్తుంది. బొమ్మల్లో వాడే బ్యాటరీల్లోనూ సీసం నిల్వలుంటాయి. చిన్నపిల్లలు ఎంచక్కా బొమ్మలతో ఆడుకుంటున్నారు కదా! అని మనం పట్టించుకోం. కానీ వాళ్లు వాటిని తరుచుగా నోట్లో పెట్టుకుంటారు. దాంతో ఆ బొమ్మలకున్న రంగంతా కూడా కడుపులోకి చేరుతుంది. కొంతమంది పిల్లలు బ్యాటరీలను కూడా తింటుంటారు. అంతేకాదు ఈ- వ్యర్థాల కాలుష్యం వల్ల కూడా సీసం గాల్లో కలుస్తుంది. ఆటబొమ్మలు, కాలుష్యం ద్వారా సీసం చిన్నపిల్లల రక్తంలో కలిసి వారి ఐక్యూ తగ్గిపోయే ప్రమాదం ఉంది. హిమోగ్లోబిన్ శాతం కూడా తగ్గిపోతుంది. విటమిన్ డి కూడా శరీరానికి అందదు. అంతేకాకుండా సీసీం.. పిల్లల మెదడు, నాడీ వ్యవస్థ, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లలు ఏకాగ్రత కోల్పోతారు. గర్భంలో ఉన్న శిశువులు, అయిదేళ్ల లోపు పిల్లలు దీని బారిన పడితే అవయవ లోపాలు కూడా తలెత్తే అవకాశం ఉంది.

సీసంతో కూడిన బ్యాటరీలను రీసైకిల్ చేసేందుకు ఉపయోగించే విధానాల వల్ల సీసం.. విషతుల్యమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా, గనుల తవ్వకాలు, ఈ-వ్యర్ధాలు, సీసంతో కూడిన మసాలా దినుసులు, పెయింట్లు , బొమ్మల ద్వారా కూడా విషపూరితమయ్యే అవకాశం ఉంది. ఆటోమొబైల్‌, ముద్రణాలయాలు, స్క్రీన్‌ ప్రింటింగ్‌ విభాగంలోనూ సీసం(లెడ్‌) ప్రభావం ఎక్కువ. బ్యాటరీ పనితీరు మందగించాక ఆ వ్యర్థాలను చాలామంది రోడ్డుపై పడేస్తుంటారు. దీనివల్ల బ్యాటరీ వ్యర్థాలు నేలలోను, తాగే నీటిలోనూ కలిసిపోతాయి. ఈ ప్రభావం పిల్లలతో పాటు పెద్దలపైనా ఉంటుంది. 5 శాతం కిడ్నీ వ్యాధులు ఇలాంటి భారీ లోహాలు శరీరంలోకి వెళ్లడం వల్లే వస్తుంటాయి. సీసాన్ని పసుపు, ఎండు మిర్చి వంటి కొన్ని రకాల వంటింటి దినుసులను నిల్వ ఉంచటానికి వాడతారు. కొన్నిసార్లు ఆయా ఆహార ఉత్పత్తుల రంగును పెంపొందించేందుకు కూడా వాడతారు. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల సీసం శరీరంలోకి చేరుతుంది.

దేశంలో సీసం బారిన పడి విషతుల్యమైన 300 ప్రదేశాలను గుర్తించారు. ఇందులో ఎక్కువగా అనధికారంగా నిర్వహిస్తున్నవే ఉన్నట్లు అధ్యయనంలో తెలిసింది. చాలా వరకు రహస్యంగా ఇళ్లలోనో, ఇంటి వెనక భాగంలోనో ఈ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.

Advertisement