దమ్ముంటే రా.. నీ కోసం వెయిట్ చేస్తున్నా!

by B.Srinivas |

ట్రంప్ హెచ్చరికలకు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.

దమ్ముంటే రా.. నీ కోసం వెయిట్ చేస్తున్నా!
X

దిశ, నేషనల్ బ్యూరో: ట్రంప్ హెచ్చరికలకు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. కొలంబియా తన పద్ధతి మార్చుకోకపోతే మదురో గతే పడుతుందంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలకు పెట్రో సవాల్ విసిరారు. ‘రా.. దమ్ముంటే మదురో మాదిరిగా నన్ను తీసుకెళ్లు.. నీ కోసం వెయిట్ చేస్తున్నా’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు. తమ దేశంపై అమెరికా సైనిక చర్య చేపడితే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. తాను ఆయుధం పట్టుకోనని గతంలో ప్రమాణం చేశానని, కానీ తమ మాతృభూమి కోసం అవసరమైతే మళ్లీ ఆయుధాలు చేపట్టేందుకు వెనకాడబోనన్నారు.

గెరిల్లా యుద్ధమే..
‘నన్ను బెదిరించొద్దు. నేను మీ కోసం ఇక్కడే వేచి ఉన్నాను. నేను దండయాత్రలను, క్షిపణులను, హత్యలను అంగీకరించను.మా రైతులపై బాంబులు వేస్తే.. వేలాది మంది గెరిల్లాలు ఉద్యమిస్తారు. ఎంతగానో అభిమానించే ప్రెసిడెంట్‌ను నిర్బంధిస్తే ప్రజలు చూస్తూ ఉండలేరు.. ఆగ్రహిస్తారు’ అని చెప్పారు. అలాగే కొలంబియన్లు రాజకీయ మాఫియాల చేతిలో మోసపోవడం ఆపాలని పెట్రో పిలుపునిచ్చారు. 7లక్షల మంది కొలంబియా ప్రజల మరణాలకు కారణమైన వారు (అమెరికన్లు).. ప్రపంచంలోనే అత్యంత అసమానతలతో కూడిన దేశంగా మార్చారని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్రంప్ ఏమన్నారంటే..
వెనిజులాలో వైమానిక దాడులు నిర్వహించి నికోలస్ మదురోను బంధించిన రెండు రోజుల తర్వాత కొలంబియాపై సైనిక చర్య గురించి ట్రంప్ బహిరంగంగా ప్రస్తావించారు. కొలంబియాను అనారోగ్యంతో బాధపడుతున్న దేశంగా అభివర్ణించారు. కొలంబియా నాయకత్వం యునైటెడ్ స్టేట్స్‌లో కొకైన్ వాణిజ్యాన్ని పెంచుతోందని ఆరోపించారు. గుస్తావో పెట్రో పేరును స్పష్టంగా ప్రస్తావిస్తూ.. మాదకద్రవ్యాల ఉత్పత్తి, అక్రమ రవాణాలో పాల్గొన్న ఒక రోగి దేశాన్ని నడుపుతున్నారని వ్యాఖ్యానించడం ఇరు దేశాల మధ్య అగ్గి రాజేసింది.

Next Story