బీజేపీకి ఓటేయొద్దు.. మళ్లీ అధికారమిస్తే నియంతృత్వ పాలనే

by Disha Web Desk 2 |
బీజేపీకి ఓటేయొద్దు.. మళ్లీ అధికారమిస్తే నియంతృత్వ పాలనే
X

దిశ, తెలంగాణ బ్యూరో: గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఓడించాలనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల చైతన్య యాత్రను నిర్వహించిన జాగో తెలంగాణ, తెలంగాణ పీపుల్స్ జేఏసీ, తెలంగాణ స్టేట్ డెమొక్రటిక్ ఫోరం సహా పలు ప్రజా సంఘాలు ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీని ఓడించండి... అనే నినాదంతో అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో యాత్రను చేపట్టాయి. హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మొదలైన ఓటర్ల చైతన్య యాత్ర ఎనిమిది రోజులుగా వివిధ పార్లమెంటు నియోజకవర్గాల్లో సాగింది. ప్రజ్ఞాపూర్, గజ్వేల్, నర్సాపూర్, సంగారెడ్డి, ఆమనగల్లు, కల్వకుర్తి మీదుగా బుధవారం నాగర్‌కర్నూల్ చేరిన ఈ యాత్ర గురువారం వనపర్తి, గద్వాల, ధరూర్ చేరుకోనున్నది. ఈ నెల 11న ఈ యాత్ర మహబూబ్‌నగర్‌లో ముగియనున్నది. మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ చేరుకునే బస్సు మొత్తం 11 రోజుల్లో ప్రజల నుంచి వచ్చిన స్పందన, వారికి కలిగించిన అవగాహన తదితరాలపై మీడియాకు వివరించనున్నాయి ఈ సంఘాలు.

రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యాత్రకు తెలంగాణ జాగో వ్యవస్థాపకులైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, తెలంగాణ స్టేట్ డెమొక్రటిక్ ఫోరానికి చెందిన వినాయక్‌రెడ్డి కన్వీనర్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు అవగాహన కలిగించిన సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడుతున్న ఆకునూరి మురళి... పదేండ్ల మోడీ పాలనలో రాష్ట్రాల నుంచి జీఎస్టీ, ఇన్‌కమ్ టాక్స్, గ్రీన్ సెస్, అగ్రి సెస్ తదితర రూపాల్లో ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులను తిరిగి ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి పనులకు, మౌలిక సౌకర్యాల కల్పనకు నామమాత్రంగానే వెచ్చిస్తున్నారని ఆరిపించారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికి ముందు (2014కు ముందు) అనేక హామీలను ఇచ్చి వాటిని తుంగలో తొక్కారని పేర్కొన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల కల్పన, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టిం చేయడం, నల్లధనాన్ని వెలికి తీయడం, ఇండ్లు లేని పేదలకు సొంతిల్లు నిర్మాణం.. ఇలాంటి ఏ హామీ కూడా సంపూర్ణం కాలేదని గుర్తుచేశారు.

ఆదాయం, సంపదలో అసమానతలు పెరిగిపోయాయని, దేశ సంపద ఎవరి చేతుల్లోనూ కేంద్రీకృతం కాకూడదన్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 ఉల్లంఘనకు గురైందని, 10 శాతం మంది ధనవంతుల చేతుల్లో దాదాపు 77% సంపద పోగుపడిందని, మోడీ సహాయ సహకారాలతోనే ఈ నిర్వాకం జరిగిందని, పేద-ధనిక సెక్షన్ల ప్రజల మధ్య అంతరం పెరిగిపోయిందని, మరోసారి బీజేపీకి అధికారం కట్టబెడితే ప్రజలకు కనీస హక్కులు కూడా మిగలవని ప్రొఫెసర్ పద్మజా షా, వినాయక్‌రెడ్డి తదితరులు ఆరోపించారు. ప్రొఫెసర్ హరగోపాల్ చేతుల మీదుగా మే 1న ప్రారంభమైన ఈ యాత్ర ఈ నెల 11న తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నది. ప్రజల నుంచి విస్తృత స్పందన వస్తున్నదని, మోడీ పాలనకు వ్యతిరేకంగా సామాన్య ప్రజానీకం గొంతెత్తుతున్నారని, అది ఓట్ల రూపంలో ప్రతిబింబించే అవకాశాలున్నాయన్నారు.

Next Story

Most Viewed