చివరి 72 గంటలు కీలకం

by Disha Web Desk 15 |
చివరి 72 గంటలు కీలకం
X

దిశ , హైదరాబాద్ బ్యూరో : లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో చివరి 72 గంటలు చాలా కీలకమైనవని, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలని హైదరాబాద్ నియోజకవర్గం జనరల్ అబ్జర్వర్ పీఐ శ్రీవిద్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏ ఆర్ ఓ, ఏసీపీ, నోడల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలలో చివరి 72 గంటలు చాలా కీలకమైనవన్నారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా జరుగేలా ఏఆర్ఓ లు, ఏసీపీలు, పోలింగ్ సిబ్బంది పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో కనీస మౌలిక వసతులు, ఫర్నిచర్, తాగునీరు, కరెంటు, టాయిలెట్స్, షామియానా, కూలర్లు ఏర్పాటు చేయాలని, ఎన్నికల విధులలో ఉన్న పోలింగ్ సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేయాలని అన్నారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ ఓ పీ) ఖచ్చితంగా అనుసరించాలని,

ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఎంసీసీ, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు .హైదరాబాద్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఈవీఎంల నిర్వహణకు సంబంధించిన ప్రతి అంశం ను వీడియోగ్రాఫీ చేయాలని అన్నారు. ఈవీఎంల నిర్వహణ జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో సెక్యూరిటీ ఉండేలా చూడాలని అన్నారు. ఈవీఎంల సాంగ్ రూముల వరకు జాగ్రత్తగా వీడియోగ్రఫీ చేయాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో, రిసెప్షన్ సెంటర్ లలో కౌంటర్ వారీగా ఈవీఎంలను తీసుకోవాలని సూచించారు. మే 11 సాయంత్రం 5.00 గంటల నుండి మే13 సాయంత్రం 6.00 గంటల వరకు ఎలాంటి రాజకీయ ప్రచారం, పాదయాత్రలు జరగకుండా చూడాలని, ప్రచార సామగ్రి సీజ్ చేయాలని, మద్యం దుకాణాలు మూసివేయాలని అన్నారు.

ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. ఈవీఎం మెషిన్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్లే వాహనాల పరిస్థితిని( కండిషన్)ను ముందుగానే సెక్టోరల్ అధికారులు పరిశీలించాలన్నారు. పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల వరకు ఎవరూ కూడా గూమికూడా వద్దని,100 మీటర్ల లోపు నిలబడ కుండా ఏ ఆర్ ఓ లు, పోలీస్ అధికారులు చూడాలని అన్నారు. పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల వద్ద ప్రింటర్ లను అనుమతించ వద్దని, గుర్తింపు కార్డులు లేకుండా అనుమతించ వద్దని ఆదేశించారు. శాంతియుతంగా ఎన్నికలు నిర్వహణ జరిగేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో డీసీపీ స్నేహ మెహ్ర, డీఆర్ ఓ వెంకటాచారి, ఏఆర్ ఓ లు, ఏ సీపీలు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed