తనిఖీలు సరే.. అభ్యర్థులపై నిఘా ఏది?

by Disha Web Desk 12 |
తనిఖీలు సరే.. అభ్యర్థులపై నిఘా ఏది?
X

దిశ, సిటీబ్యూరో : పార్లమెంట్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా కోడ్ అమలు చేయడంలో జిల్లా ఎన్నికల అధికారులు ధ్వంధ వైఖరిని అవలభిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్చి 16న పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే కోడ్ అమలు పై దృష్టిపెట్టిన జిల్లా ఎలక్షన్ స్టాఫ్ సామాన్యులు రూ.50 వేల పైచిలుకు తీసుకెళ్తుంటే తనిఖీలు చేసి మరీ స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ రకంగా ఇప్పటి వరకు హైదరాబాద్ జిల్లాలోని ఎఫ్ఎస్ టీమ్‌లు, ఎస్ఎస్ టీమ్‌లు రూ.22 కోట్ల నగదును పట్టుకున్నారు. కానీ గుట్టుచప్పుడు కాకుండా కాస్ట్లీ వాహనాల్లో తరలుతున్న నోట్ల కట్టలను పట్టుకోవడంలో జిల్లా ఎన్నికల అధికారి విఫలమవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అభ్యర్థులు తమ ప్రచారం తుది దశకు చేరుకోవడంతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే కార్యక్రమానికి దాదాపు అన్ని పార్టీల అభ్యర్థులు తెరదీశారు.

హైదరాబాద్ జిల్లా పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా గుట్టుచప్పుడు కాకుండా అసహ్యంగా నగదు పంపిణీకి ఎగబడినట్లు సమాచారం. నగరంలోని మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, వీటిల్లో 14 నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థులు ఓట్ల కొనుగోలుకు నగదు పంపిణీ చేస్తుండగా, ఇక అసెంబ్లీ ఉప ఎన్నికలు జరుగుతున్న కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఓట్ల కోసం ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యేలకు దిగువన ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించుకుని ప్రచారంలో పాల్గొంటున్న కార్యకర్తలకు, ప్రజలకు నగదును పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఓ ఏరియాలో ప్రచారాన్ని నిర్వహించిన అనంతరం అక్కడ నగదును పంపిణీ చేయని పార్టీల నేతలు ఇరుగుపొరుగు డివిజన్లకు పిలిపించుకుని మరీ నగదును పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.

అభ్యర్థులకు వరం..

ప్రచార కార్యక్రమాలను అనుమతులు తీసుకున్న తర్వాతే నిర్వహించుకోవాలని సూచించిన జిల్లా ఎన్నికల అధికారి ప్రచారంలో అభ్యర్థిని ఫాలో అయ్యేందుకు షాడో టీమ్‌లను ఏర్పాటు చేయకపోవటం అభ్యర్థులకు వరంగా మారిందన్న వాదనలున్నాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నాంపల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీలో పెద్దగా పేరు లేని నేతలను ఇన్‌చార్జిలుగా నియమించి, వారి ద్వారా నగదును పంపిణీ చేయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు దాదాపు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నట్లు సమాచారం. కానీ నాంపల్లి నియోజకవర్గంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన నేతను ఇన్‌చార్జిగా నియమించటం పట్ల స్థానిక కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అసంతృప్తి వర్గాలను సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ తన నివాసానికి పిలిపించుకుని చర్చలు జరిపి, బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.

పోలింగ్ బూత్‌ల కేటాయింపులు..పైసల పంపిణీ..

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఇప్పటికే రాత్రిపూట తమ పార్టీ శ్రేణులకు, బస్తీ నాయకులకు, డివిజన్ స్థాయి నేతలకు పోలింగ్ బూత్‌లను కేటాయించటంతో భారీ ఎత్తున నగదును అందజేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒక్కో పోలింగ్ బూత్‌లో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్యను బట్టి రెండు రోజులకోసారి రూ.5 వేల నుంచి రూ.10 వేల మధ్య నగదు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ల వారీగా, మురికివాడలు, బస్తీల వారీగా ఓట్లను లెక్కేసి ఓటరు గుర్తు పట్టని వారితో వారింటికి నగదును పంపిస్తున్నట్లు సమాచారం. ఓట్ల వారీగా నగదు పంపిణీ ఇప్పటికే నాంపల్లి, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, ఖైరతాబాద్, సికిందరాబాద్, ముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో రహస్యంగా జరుగుతున్నట్లు సమాచారం.

దీనికి తోడు మూడు ప్రధాన పార్టీలకు కొన్ని ఏరియాల్లో పోలింగ్ ఏజెంట్లు లేకపోవటంతో స్థానికంగా విద్యావంతులైన వారిని ఏజెంట్లుగా నియమించుకుని, వారికి పోలింగ్ రోజు ఒక్కరోజే పని చేసేందుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు చెల్లింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఆకస్మికంగా ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని తనిఖీలు సోదాలు నిర్వహించే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్‌లు, సీ-విజిల్‌లో ఫిర్యాదులొస్తేనే దాడులు నిర్వహించే స్టాటిస్టికల్ సర్వైలెన్స్ టీమ్‌లు అభ్యర్థులు నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలను ఫాలో అవుతే నగదు పంపిణీ వ్యవహారాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునే అవకాశాలున్నా, ఆ దిశగా ఈ టీమ్‌లు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు.

Next Story

Most Viewed