రూ.3,000 కోట్ల డిజిటల్ కరెన్సీ స్కామ్‌లో FBIకి కావాల్సిన వ్యక్తిని అరెస్ట్ చేసిన ఈడీ

by Disha Web Desk 17 |
రూ.3,000 కోట్ల డిజిటల్ కరెన్సీ స్కామ్‌లో FBIకి కావాల్సిన వ్యక్తిని అరెస్ట్ చేసిన ఈడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా ఏజెన్సీ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(FBI) ఇచ్చిన సమాచారం ఆధారంగా భారత్‌‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రూ.3,000 కోట్ల డిజిటల్ కరెన్సీ స్కామ్‌‌కు సంబంధించి శనివారం ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ ప్రాంతంలో పర్వీందర్ సింగ్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. ఈ స్కామ్‌కు గురించి ఎఫ్‌బీఐ, భారత్‌తో సంప్రదింపులు జరిపింది. శుక్రవారం నుంచి ఇక్కడ సోదాలు జరుగుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి అనేక ముఖ్యమైన పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎఫ్‌బీఐ నుంచి మరింత సమాచారాన్ని తీసుకున్న ఈడీ దర్యాప్తు చేపడుతుంది. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బును డిజిటల్ కరెన్సీగా మార్చి భారత్‌ వెలుపలకు పంపించడంలో నిందితులు కీలకంగా ఉన్నారు. అమెరికా ఎఫ్‌బీఐ ఇప్పటికే రూ.1500 కోట్ల విలువైన డిజిటల్ కరెన్సీ ఆస్తులను జప్తు చేసింది. కొద్ది రోజుల క్రితం ఎఫ్‌బీఐ ఈ ఆపరేషన్‌ను మొదలుపెట్టగా భారత్‌లో ఈ కేసుకు సంబంధించిన లింక్‌లు ఉన్నాయని కనిపెట్టి ఇక్కడి అధికారులను సంప్రదించగా ఈడీ-ఎఫ్‌బీఐ సంయుక్తంగా కలిసి భారత్‌లో నిందితులను వెతుకుతున్నారు.

అక్రమ డబ్బును డిజిటల్ కరెన్సీలుగా మార్చి సరిహద్దుల మధ్య లావాదేవీలు చేస్తున్నారన్నా సమాచారంతో ఎఫ్‌బీఐ ఈ దర్యాప్తును ప్రారంభించింది. ఈ స్కామ్ విలువ మొత్తం రూ.3000 కోట్లు. సీమాంతర ఆర్థిక నేరాలను అరికట్టేందుకు ఈడీ, అంతర్జాతీయ ఏజెన్సీల సహకారంతో పనిచేస్తుందని భారత అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.



Next Story

Most Viewed