బీజేపీకి 400 సీట్లు రాజ్యాంగ సవరణకేనా?

by Disha edit |
బీజేపీకి 400 సీట్లు రాజ్యాంగ సవరణకేనా?
X

గత కొంతకాలంగా, రాజ్యాంగాన్ని మార్చడం అనే అంశం వార్తలలో నలుగుతుంది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ వార్త మరింత వేడిని పెంచిందనే చెప్పాలి. దీనితో ముడిపడి ఉన్న రిజర్వేషన్ల రద్దు తేనె తుట్టెను మళ్లీ కుదిపినట్టయింది. రాజ్యాంగాన్ని మారుస్తాం! అన్న ప్రచారంతోనే ఈ సమస్యకు బీజం పడింది. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ. తదితర వర్గాలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రమాదంలో పడుతుందనే భావన ప్రజల్లోకి బలంగా వెళ్ళింది.

ఒక్కమాటలో చెప్పాలంటే రాజ్యాంగాన్ని మార్చడం అంటే, డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలతో ఢీకొట్టడమే కాగలదు. ఇది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈ అంశంపై, రాజకీయ పార్టీలు తమ వైఖరిని తక్షణం స్పష్టం చేయాల్సిన పరిస్థితి అనివార్యమైంది. ప్రస్తుతం రాజకీయ పార్టీల ముందున్న అతి పెద్ద సవాలిదే. రాజ్యాంగం రద్దు విషయం కీలకమైనందున ఈ సమస్య జాతీయ ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ విషయంపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అధినాయకత్వం రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, రాజ్యాంగాన్ని మార్చమని ప్రకటిస్తుంటే, క్రింది స్థాయి మంత్రులు, వివిధ పదవులలో ఉన్నవారు రాజ్యాంగాన్ని మారుస్తాం, రిజర్వేషన్లు తొలగిస్తాం అంటున్నారు. వీరిలో మరికొంతమంది ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్ మాత్రమే తొలగిస్తామని అంటున్నారు. అయితే, కర్ణాటకలో ముస్లింలు రిజర్వేషన్లు తగ్గించి, దాన్ని లింగాయత్‌లకు కేటాయించిన విషయం మరువరాదు. మతం, కులం, రిజర్వేషన్ల అంశం దేశంలోని వివిధ ప్రాంతాల్లో (రాష్ట్రాల్లో) పరిస్థితులకు వేరువేరుగా ఉన్నాయి. ఒకే విధమైన నిదానంతో సమస్యలను పరిష్కరించడం సాధ్యం కాదు. జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, కేరళ, తెలుగు రాష్ట్రాలు ఇలా ఒక్కో రాష్ట్రంలో ఈ సమస్య ఒక్కో విధంగా ఉంది. అందుకనే దేశవ్యాప్త ఎన్నికలకు, జాతీయ పార్టీలకు ఒకే నినాదం అన్నది జటిలంగా మారింది.

పుస్తకాల్లో దాగిన ప్రజా హక్కులు

దేశంలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ పెద్ద ఎత్తున జరుగుతుండటంతో, రిజర్వేషన్ల అమలు సమస్య చర్చకే రాని పరిస్థితి ఏర్పడింది. రాజ్యాంగంలో కల్పించబడిన అవకాశాలు సరిగా అమలు కావడం లేదని బహుజనులు, దళిత ఆదివాసీలు, మైనారిటీలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ రంగం బలహీనపడితే, రాజ్యాంగ సవరణ లేకుండానే ఆటోమేటిగ్గా రిజర్వేషన్లు రద్దయిపోతాయి. కానీ, ఈ మౌలికాంశం పెద్దగా చర్చకు రాకపోవడం శోచనీయం. సాంకేతికత, వృత్తి నైపుణ్యత ప్రధానంగా ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు పరమవుతుండగా, అంతంత మాత్రంగా మిగిలిన సంస్థలలో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏపాటివి. జనాభా దామాషా ప్రకారం విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు లభించడం లేదు. సమాజంలో పెరుగుతున్న హింస హెచ్చుమీరి, సామాన్య ప్రజల జీవించే హక్కు మృగ్యమై కేవలం పుస్తకాలలో నిద్రాణమై ఉన్నదన్న విషయం విధితమే. అందుకే ఇది అన్ని రాజకీయ పార్టీలకు చాలా చిక్కు సమస్య. అంత తేలిగ్గా అర్థం అయ్యేది కాదు. ఈ సమస్యను ప్రధాన ఎజెండాగా, నినాదంగా మార్చి, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఒకవేళ పాలక పార్టీలు ప్రజల మౌలిక సమస్యలను చర్చించకుండా, మరుగున పెట్టేందుకు రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా రాజ్యాంగ రద్దు, రిజర్వేషన్ల రద్దు అంశాలను తెరపైకి తెచ్చారా? అన్న అనుమానాలు కూడా బహుళంగానే వినిపిస్తున్నాయి. ఈ విషయాల పట్ల బుద్ధి జీవుల పాత్ర నామమాత్రంగానే కనబడుతున్నది.

బలగాన్ని పెంచుకునేందుకు..

భారతదేశంలో రాజ్యాంగ రద్దు, రిజర్వేషన్ల రద్దు సమస్య అంత ఆషామాషీగా జరిగేది కాదు. రాజ్యాంగాన్ని మార్చాలంటే ప్రాథమికంగా పార్లమెంటులో రెండింట మూడు వంతుల సభ్యుల ఆమోదం పొందాలి. కొన్ని సందర్భాల్లో పార్లమెంట్, అసెంబ్లీలు రెండింటిలో ఆమోదం పొందాల్సి వస్తుంది. ఇలా ఎన్నో విధానపరమైన సమస్యలు ఉంటాయి. ఇదేమీ అంత తేలికగా పరిష్కారం అయ్యే అల్లాటప్పా వ్యవహారం కాదు. అందుకేనేమో బీజేపీ తన బలగాన్ని పెంచుకునేందుకు, పార్లమెంట్ ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలిపించాలని కోరుతుందనే అనుమానం బలపడుతోంది.

సంపదంతా అదానీ, అంబానీలకేనా!

ఆరెస్సెస్ ప్రముఖ్ సదాశివరావు గోల్వాల్కర్ తన పుస్తకం We and our Nationhood identified రాస్తూ అధికారం చేజెక్కించుకోగానే మొదటగా చేయవలసింది ప్రభుత్వ ఆస్తులు, భూమి, అడవి సంపద అంతా ఇద్దరూ లేక ముగ్గురు విశ్వసనీయ సంపన్నులకు స్వాధీన పరచాలి. అప్పుడు ఏడు తరాల వరకు అధికారం మన వద్దే ఉంటుంది అన్నారు. ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతంగా, ఏర్పడి నడుస్తున్న బీజేపీ కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత సరిగ్గా ఇదే కార్యచరణ కొనసాగుతుండడం అందరి దృష్టిలో ఉన్నది. జాతి సంపదంతా అదానీ, అంబానీలకే దోచిపెడుతున్నారనే అపవాదు బీజేపీ ఇప్పటికే మూట కట్టుకుంది. అందువల్లనే రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ రద్దు విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి కారణంగా, మెజారిటీ ప్రజలు ఆ పార్టీని విశ్వసించడం లేదు. ఈ నినాదం ప్రజలలోకి ప్రబలంగా వెళితే ఈసారి జరిగే పార్లమెంటు ఎన్నికలలో బీజేపీకి అధికారం దక్కించుకోవడం అంత సులభం కాదు.

రమణాచారి

రాజకీయ, సామాజిక విశ్లేషకులు

99898 63039

Next Story

Most Viewed